15 ఏళ్ల యువ ఆటగాడితో జాగ్రత్తగా వ్యవహరించాలి.. కోచింగ్ సిబ్బందికి పార్థివ్ పటేల్ సూచన
న్యూఢిల్లీ : భారత క్రికెట్‌లో ప్రస్తుతం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగుతోంది. అతడికి త్వరగా టీమిండియాలో అవకాశం కల్పించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుతున్నప్పటికీ, జట్టు యాజమాన్యం మాత్రం ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితం చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ భారత వికెట్‌కీపర్ పార్థివ్ పటేల్ కోచింగ్ సిబ్బందికి కీలక సూచనలు చేశాడు.
స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన పార్థివ్ పటేల్.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఏదో ఒక మ్యాచ్‌లో వైభవ్‌కు అవకాశం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే, అప్పటి వరకు అతడితో సరైన రీతిలో మాట్లాడాల్సిన బాధ్యత కోచింగ్ సిబ్బందిపైనే ఉందని పేర్కొన్నాడు.
''వైభవ్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వలేకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా అతడికే చెప్పాలి. అదే సమయంలో 'నువ్వు ఇంకా ఎంపిక కోసం పోటీలోనే ఉన్నావు' అనే నమ్మకాన్ని కల్పించాలి. అలా చేస్తే అతడు నిరాశ చెందకుండా, సానుకూల దృక్పథంతో అవకాశాల కోసం ఎదురుచూస్తాడు'' అని సూచించాడు.
కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్‌తో ఎంతో సున్నితంగా వ్యవహరించాలని పార్థివ్ అభిప్రాయపడ్డాడు. అవకాశం కోసం ఓపికగా ఎదురుచూడాల్సి ఉంటుందని అర్థమయ్యేలా చెప్పాలని, అప్పుడే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినదని పేర్కొన్నాడు.
వైభవ్‌కు ఇప్పుడే టాప్ ఆర్డర్‌లో చోటు కల్పించడం అంత సులభం కాదని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు. సంజూ శాంసన్ ఇటీవల ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవగా, ఇషాన్ కిషన్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడని, అభిషేక్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడని గుర్తుచేశాడు. ఈ పరిస్థితుల్లో వైభవ్‌కు వెంటనే అవకాశం రాకపోవచ్చని, అదే విషయాన్ని అతడికి స్పష్టంగా వివరించాలని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందికి సూచించాడు.
కాగా, ఐర్లాండ్ పర్యటనలోనూ వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లోనూ అతడిని తుది జట్టులోకి తీసుకోలేదు. మరోవైపు ఓపెనర్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వైభవ్‌కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ మరింత బలపడుతోంది.
భారత్–ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్ శనివారం మాంచెస్టర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా వైభవ్‌కు అవకాశం దక్కుతుందా అనే అంశంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







కామెంట్‌లు (0)