ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

యంత్రాల మరమ్మతులు చేసి ప్రాణాలు కాపాడండి

1 గంట క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 01:21 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- రూ.8 వేల కోట్లు తక్షణం విడుదల చేయండి

- మహాధర్నాలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో యంత్రాల మరమ్మతులకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ప్రకటించిన రూ.ఎనిమిది వేల కోట్లను తక్షణం విడుదల చేసి ఉద్యోగుల, కార్మికుల ప్రాణాలు కాపాడాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు సిహెచ్ నర్సింగరావు, డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద 1970 రోజులుగా జరుగుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమ దీక్షా శిబిరంలో ఆదివారం విశాఖ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. స్టీల్‌ ‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌ (‌సిఐటియు) ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరామ్ అధ్యక్షత వహించిన ఈ ధర్నాలో నర్సింగరావు, ఆదినారాయణ, రాజశేఖర్ మాట్లాడారు. ప్రభుత్వం రాజ్యాంగపరంగా కల్పించిన వాక్ స్వాతంత్ర్య హక్కును నేడు స్టీల్‌‌ప్లాంట్‌ యాజమాన్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేయాలనుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ నెల ‌పదిన మీడియాతో, సామాజిక మాధ్యమాలలో స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడడంకాని, ప్రశ్నించడంగానీ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్టీల్ యాజమాన్యం సర్క్యులర్‌‌ను విడుదల చేసిందన్నారు. కార్మికులకు రూ.900 కోట్లు బకాయి పడిన యాజమాన్యాన్ని ప్రశ్నించకూడదనడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గడచిన నాలుగు దశాబ్దాలుగా స్టీల్ ప్లాంట్‌‌ ఆస్తుల రక్షణ చేపడుతున్న సిఐఎస్ఎఫ్‌‌ను పూర్తిగా తొలగిస్తూ ఇటీవల ఆదేశాలు ఇవ్వడం దారుణమన్నారు. అయోధ్యరామ్‌ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌‌లో యంత్రాల మరమ్మతులకు గురవడం, కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం‌తో పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించడానికి అవరోధంగా ఉందని వివరించారు. విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు ఆర్‌‌కెఎస్‌‌వి కుమార్‌, బి నాగభూషణం, పడాల రమణ, పివి సురేష్, ఎన్ రామారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రైవేటీకరణ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థించడం సరికాదన్నారు. ఇప్పటికైనా టిడిపి కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసి ప్లాంట్‌ను రక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు కెఎం.శ్రీనివాస్, రమణమూర్తి, డొక్కా నర్సింగరావు, డివి రమణారెడ్డి, డి సురేష్ బాబు, సిహెచ్ సన్యాసిరావు, అధిక సంఖ్యలో కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, విఆర్ఎస్ కార్మికులు పాల్గొన్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్