ప్రజాశక్తి - నూజివీడు టౌన్ (పశ్చిమగోదావరి జిల్లా) : ఆర్‌జియుకెటి ఆంధ్రప్రదేశ్ ఆరో స్నాతకోత్సవం నూజివీడు ట్రిపుల్ ఐటి శాప్ ఆడిటోరియంలో శనివారం ఘనంగా నిర్వహించారు. 2022, 2023, 2024, 2025 విద్యా సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్‌జియుకెటి పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంగణాల్లో బిటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులకు పట్టా ప్రదానోత్సవం నిర్వహించారు. బిటెక్ చదివి టాపర్స్‌గా నిలిచిన 26 మంది విద్యార్థులకు, ఎంటెక్ చదివిన ఎనిమిది మంది విద్యార్థులకు ముఖ్య అతిథి, భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ సభ్యులు ఆచార్య గోవర్ధన్ దాస్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆర్‌జియుకెటి కులపతి ఆచార్య కొత్త మధుమూర్తి, ఉప కులపతి ఆచార్య మద్దాలి లక్ష్మీ నారాయణరావు పట్టా ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య గోబర్ధన్ దాస్ మాట్లాడుతూ ప్రతిభావంతమైన గ్రామీణ యువతకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడం, నిజమైన విద్యా సమానత్వాన్ని ప్రోత్సహించడం అనే దృష్టితో ఈ సంస్థ స్థాపించినట్లు తెలిపారు. నేటి సమస్యలు పరిష్కరించడానికి ఇంజనీరింగ్, సైన్స్, హ్యూమానిటీస్ కలిసిన సమగ్ర ఆలోచన అవసర మన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి ఉద్యోగార్ధులు కాకుండా ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, సమస్య పరిష్కారకులుగా మారాలని సూచించారు. ఆచార్య మధుమూర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఆర్‌జియుకెటి నేడు రాష్ట్రానికి, దేశానికి ప్రతిభావంతులైన ఇంజనీర్లను అందిస్తోందని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో బిటెక్, మైనర్ కోర్సులు, కొత్త ఎంటెక్ కోర్సులను ప్రారంభించడంతో పాటు ప్రయోగశాలలు, డిజిటల్ లెర్నింగ్, హాస్టళ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.20 కోట్లకుపైగా వ్యయం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆచార్య లక్ష్మీ నారాయణరావు విశ్వవిద్యాలయం వార్షిక నివేదికను ప్రకటించారు. ఈ స్నాతకోత్సవంలో ఆర్‌జియుకెటి రిజిస్ట్రార్, ఒంగోలు క్యాంపస్ డైరెక్టర్ ఆచార్య అమరేంద్ర కుమార్‌తోపాటు నూజివీడు క్యాంపస్ డైరెక్టర్ ఆచార్య గోపాలరాజు, శ్రీకాకుళం డైరెక్టర్ ఆచార్య గిరిధర్ మద్రాస్, ఇడుపులపాయ డైరెక్టర్ ఆచార్య గెడ్డం విజయప్రకాష్, సెంట్రల్ డీన్ దువ్వూరి శ్రావణి, సెంట్రల్ ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ నాగార్జున దేవి, ఇఐటిపి డీన్ శ్యాం, సెంట్రల్ ఇవాల్యుయేషన్ డీన్ రియాజ్, నాలుగు క్యాంపస్‌లకు చెందిన అకడమిక్ డీన్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)