శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గోదావరిలో దూకి ఎఇ కుటుంబం గల్లంతు

17 ఆగస్టు, 2026

godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 08:14 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రాణాలతో బయటపడిన మనవడు కార్తికేయరెడ్డి

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సిటీ : పిఠాపురం పంచాయతీరాజ్ ఎఇ కుటుంబం ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత రాజ మహేంద్రవరంలోని రోడ్డు కం రైలు బ్రిడ్జి నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఎఇ, ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. మనువడు ప్రాణాలతో బయటపడ్డాడు. రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద పంచాయతీ రాజ్ ఎఇ టి నూకరాజు కుటుంబం ఉంటోంది. ఆయన ప్రస్తుతం పిఠాపురం మండలంలో పనిచేస్తున్నారు. ఆయన అల్లుడు అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జులై 2న మరణించారు. అప్పటి నుంచి కుమార్తె సౌజన్య, మనవడు రియాంచ్ కార్తికేయ నూకరాజు ఇంట్లోనే ఉంటున్నారు. నూకరాజు, తన భార్య మణి, కుమార్తె, మనువడితో కలిసి రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు బ్రిడ్జిపైకి వచ్చి 80వ నెంబరు పిల్లరు వద్ద కారును ఆపి గోదావరి నదిలోకి దూకేశారు. ఎనిమిదేళ్ల కార్తికేయ ఈతకొడుతూ మత్స్యకారులకు కనిపించడి, వారు రక్షించారు. ఎఇ నూకరాజు, మణి, సౌజన్య గల్లంతయ్యారు. రెండో పట్టణ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి నూకరాజు ఒక సూసైడ్ నోటును రాసి స్నేహితులు, అధికారుల గ్రూపులో పోస్టు చేశారు. తమ మరణానికి కాకినాడలోని ప్రో షూటింగ్ ఇన్ స్టిట్యూట్ అధినేత షేక్ షాదిక్ ఖాన్ కారణమని పేర్కొన్నారు. తన అల్లుడి మరణం తరువాత తన కుమార్తెకు అండగా ఉంటానని వేధించేవాడని పేర్కొన్నారు. తన మనువడికి షూటింగ్‌‌లో తర్ఫీదు ఇస్తానంటూ తన కుమార్తెను నమ్మించి, నగలు, నగదు, బ్యాంకు ఖాతాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడని తెలిపారు. ఒప్పుకోకపోవడంతో చంపేస్తానని బెదిరించాడని, షాదిక్ ఖాన్ ఒలింపిక్స్ జట్టుకు కోచ్‌‌గా కూడా ఎంపికయ్యాడని, ఈ దుర్మార్గుడిని శిక్షించాలని పేర్కొన్నారు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్

బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్‌‌పిలతో ఫోన్‌‌లో ఆయన మాట్లాడారు. గాలింపునకు అవసరమైతే ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించాలన్నారు. ఈ ఘటన నుంచి బయటపడిన నూకరాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బెదిరింపులు ఎదురైనప్పుడు పోలీసులను, అధికారులను సంప్రదించాలని సూచించారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్