- మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :' విశాఖపట్నం తీరంలో గల్లంతైన మత్స్యకార పడవలోని ఆరుగురు మత్స్యకారుల ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలు ప్రస్తుతం అనుభవిస్తున్న వేదన, ఆందోళన, అనిశ్చితి ఎంతగానో కలచివేస్తోందని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆత్మీయుల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యుల మనోవేదనను ప్రభుత్వం పూర్తిగా అర్థం చేసుకుందని, ఈ క్లిష్ట సమయంలో వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, వారి సురక్షిత రాక కోసం ప్రార్థిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం భారత కోస్ట్ గార్డ్, భారత నౌకాదళం, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీతో పాటు ఇతర సంస్థలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఆరుగురు గల్లంతై 4 రోజులు గడుస్తున్నందున బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాల పట్ల ప్రభుత్వం సంపూర్ణ సానుభూతితో ఉందని పేర్కొన్న మంత్రి, వారికి తక్షణ సహాయంగా కమిషనర్ సూచనల మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధితులు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను కొనసాగించడంతో పాటు బాధిత కుటుంబాల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు.








కామెంట్‌లు (0)