ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ
ప్రజాశక్తి-మర్కాపురం : మార్కాపురం జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముందు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి కంభం సెంటర్ వరకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కంభం సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి. రమాదేవి సభలో ప్రసంగించారు. మార్కాపురం జిల్లా సమగ్ర అభివృద్ధికి రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలన్నారు. జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని చెరువులను అభివృద్ధి చేసి సాగునీటి వసతి కల్పించాలని, పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచాలన్నారు. మార్కాపురం మెడికల్ కాలేజీని త్వరితగతిన పూర్తి చేసి పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. మార్కాపురం జిల్లా కేంద్రానికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. ఈ భారీ బహిరంగ సభకు సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.









కామెంట్‌లు (0)