- ఎపి రైతు సంఘం డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో రెండో విడత భూసేకరణలో భాగంగా గోరపూడి భూముల్లో ఫెన్సింగ్ వేసేందుకు రెవెన్యూ అధికారులు.. పోలీసు బలగాలను ఉపయోగించి రైతులపై దౌర్జన్యం చేయడాన్ని ఎపి రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే రెవెన్యూ, పోలీస్ అధికారులు అత్యుత్సాహంతో చేస్తున్న బలవంతపు భూసేకరణ వల్ల గోరపూడికి చెందిన లాలం నరసింహారావు, అప్పన్నపాలెంకు చెందిన చింతలపూడి నూకరాజు అనే ఇద్దరు రైతులు గుండె ఆగి మరణించినట్లు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా నిలబడ్డ రైతు సంఘం, సిపిఎం నాయకులను అక్రమంగా అరెస్టు చేసి, దౌర్జన్యంగా రైతుల భూముల్లో ఫెన్సింగ్ వేయడాన్ని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. రైతులకు న్యాయంగా చెల్లించాల్సిన నష్ట పరిహారం చెల్లించకుండా 2018 నాటి రేట్ల ప్రకారం పరిహారం చెల్లించడంపై అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతమున్న మార్కెట్ రేట్ల ప్రకారం 2013 భూ సేకరణ చట్టం నిబంధనలకనుగుణంగా రైతులకు నష్టపరిహారం చెల్లించి భూములు సేకరించాలి తప్ప.. దౌర్జన్యంగా పోలీసులను మోహరించి వారిని భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా భూసేకరణ చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికైనా గృహ నిర్బంధంలో ఉంచిన రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజును, అరెస్టు చేసి పోలీస్టేషన్‌లో నిర్బంధించిన సిపిఎం నాయకులను తక్షణమే విడుదల చేయాలని, రైతులకు న్యాయమైన పరిహారం ఇచ్చిన తర్వాతే భూసేకరణకు పూనుకోవాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)