గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉద్యానపంటల కేంద్రంగా రాయలసీమ

1 గంట క్రితం

Minister-Atchannaidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 10:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్’ కార్యక్రమానికి సమగ్ర కార్యాచరణ రూపొందించిందని వ్యవసాయ, ఉద్యాన వన శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు సంప్రదాయంగా తక్కువ ఆదాయం ఇచ్చే వర్షాధార పంటలకే పరిమితం కాకుండా, తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే ఉద్యాన పంటల వైపు అడుగులు వేయాలన్నదే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతంలో వార్షిక వర్షపాతం పరిమితంగా ఉండటం, తరచూ కరువు పరిస్థితులు ఏర్పడటం, సాగునీటి కొరత, మార్కెట్ అనుసంధానం లోపించడం వంటి సమస్యలను ఒక్కొక్కటిగా కాకుండా నీరు నుంచి మార్కెట్ వరకు రైతుకు ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒకేసారి పరిష్కారం చూపేలా సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యానికి మొదటి నుంచీ అత్యంత ప్రాధాన్యం లభించిందన్నారు.

రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళికలో సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు ప్రతిపాదించామని తెలిపారు. ఇందులో ప్రభుత్వ రంగంలో రూ.40,352 కోట్లు, ప్రైవేటు రంగం నుంచి సుమారు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు సమీకరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ప్రభుత్వ పెట్టుబడుల్లో సాగునీటి రంగానికి రూ.20,884 కోట్లు, ఉద్యానవన రంగానికి రూ.14,906 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.4,562 కోట్లు ప్రతిపాదించినట్లు వివరించారు. 2026 ఆగస్టు నుంచి 2029 జూలై వరకు మూడు దశల్లో కార్యక్రమాన్ని అమలు చేసి, 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఉద్యాన విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం, ఉత్పత్తిని దాదాపు రెట్టింపు చేయడం, సుమారు 9.6 లక్షల రైతుల ఆదాయం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యమన్నారు.

మొదటి దశలో 2026–27లో రూ.12,066 కోట్లతో 72 క్లస్టర్లపై దృష్టి సారిస్తామని తెలిపారు. రిజర్వాయర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, చెరువులు, చివరి ఆయకట్టు వరకు నీరు చేరే వ్యవస్థలు, కీలక గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. రెండో దశలో 2027–28లో రూ.15,036 కోట్లతో మరో 67 క్లస్టర్లు, మూడో దశలో 2028–29లో రూ.13,250 కోట్లతో మిగిలిన 62 క్లస్టర్లను అభివృద్ధి చేసి మొత్తం 201 క్లస్టర్లను సమగ్ర ఉద్యాన ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ కేంద్రాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్