గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వర్ష బీభత్సంతో సామర్లకోట అతలాకుతలం

1 గంట క్రితం

వర్ష బీభత్సంతో సామర్లకోట అతలాకుతలం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 05:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - సామర్లకోట : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణం, మండల పరిధిలో పలు లోతట్ట ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. 23,24 రెండు రోజులపాటు సామర్లకోటలో సుమారు 200 మిల్లీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదయింది. సామర్లకోట పిఠాపురం రోడ్డులో పాత ఏటి వంతెన వద్ద ఏలేరు కాలువ నీటి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. దీంతో పిఠాపురం రోడ్డులో ఉన్న పంటపొలాలతోపాటు , వికె.రాయపురం, వేట్లపాలెంలో వందలాది ఎకరాల పంట పొలాలు వర్షం నీటితో మునిగి చెరువులను తలపిస్తున్నాయి. తమ గ్రామం మీదకి వేట్లపాలెం గ్రామం వద్ద వైరుకాల గేట్లను తెరవడంతో వికె.రాయపురం పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల పంట పొలాలు నీటి ముంపునకు గురైనట్లు ఆ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతి ఏటా తుపానుల సమయంలో తమ గ్రామానికి అధికారులు వైరు కాలువల ద్వారా నీటిని వదిలి అన్యాయం చేస్తున్నారని, పంటలు వేసుకోవద్దంటే క్రాప్ హాలిడే ప్రకటించమని చెప్పాలని, అవగాహన కల్పించి పంటలు సాగు చేశాక ఈ విధంగా అధికారులు తమ పంటలను దెబ్బతీస్తున్నారని వికె.రాయపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చిరు పొట్ట దశలో ఉన్న తమ వరి పంట చేతికి అందకుండా పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అప్పులు చేసి ఎకరానికి రూ.40 వేల వరకూ పెట్టుబడులు పెట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సామర్లకోట అన్న క్యాంటీన్ సమీపంలో భారీ చెట్టు విరిగి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటంతో సరఫరా నిలిచిపోయింది. అధికారులు వెంటనే చెట్టును తొలగించి విద్యుత్ పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. స్థానిక 23వ వార్డు సత్యనారాయణపురం, ఎఫ్‌సిఐ కాలనీల్లో రైల్వే డ్రైనేజీ మూసివేయడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక ముంపు ఏర్పడింది. సత్యనారాయణపురం ప్రాంతాలు మోకాళ్ళ లోతు నీటిలో మునిగాయి. దీంతో ప్రజలు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జగనన్న కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు లేక నీరు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతంలో పరిస్థితిని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్ , మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్, నాయకులు పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. భారీ వర్షాలకు బ్రౌన్‌పేట అంబేద్కర్ కాలనీలో అందుగుల అబ్బుకు చెందిన ఇల్లు, 13వ వార్డు బలుసులపేటలో కాళ్ల రవీంద్రకు చెందిన పెంకుటిల్లు కూలిపోయాయి. రెండు ఘటనల్లోనూ ప్రాణనష్టం తప్పింది.మరోవైపు సామర్లకోట–పిఠాపురం రహదారి వెంబడి పంట పొలాలు నీట మునిగాయి. ఉప్పువారి సత్రం సమీపంలోని టిడ్కో గృహాల వద్ద ఏలేరు కాలువ వరద నీరు గట్టు దాటి ప్రవహిస్తుండటంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. జి.రాగంపేట రోడ్ లో గల జగనన్న కాలనీలో రోడ్లు డ్రైన్లు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో భారీ వర్షాలకు కాలనీ మొత్తం రోడ్లు నీటి ముంపునకు గురయ్యాయి. కాలనీవాసులు రాకపోకలకు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వేట్లపాలెంలో రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టును తహశీల్దారు కోవూరు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తొలగించారు. ముంపు ప్రాంతాల్లో తక్షణమే నీటిని తొలగించి, డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్