ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఈ నెల 29న పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసి) పునర్ వ్యవస్థీకరణ ఎన్నికలు జరగనున్నాయని సమగ్రశిక్ష డైరెక్టరు బి శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఎస్‌ఎంసి మార్గదర్శకాలు-2026 ఆధారంగా ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యాన ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుందని తెలిపారు.
ఈ నెల 18న పాఠశాలల నోటీస్ బోర్డుపై ఓటర్ల జాబితా ప్రదర్శన, 25వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఈ జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ, పరిష్కారం ఉంటుందని తెలిపారు. అదేరోజు తుది ఓటర్ల జాబితా ఖరారు చేసి ప్రదర్శిస్తారని వెల్లడించారు. 29న ఎస్‌ఎంసి సభ్యుల ఎన్నిక నిర్వహణ, ఖరారు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఉంటుందని తెలిపారు. ఆ తరువాతే ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించి వెంటనే ప్రమాణ స్వీకారోత్సవం జరుపుతామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి ఆయా జిల్లాల ప్రాంతీయ విద్యాశాఖ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.








కామెంట్‌లు (0)