నష్టపరిహారం కోసం రైతుల రాస్తారోకో
ఉప్పాడ–పిఠాపురం రహదారిపై నిలిచిన వాహనాలు
ప్రజాశక్తి - యు.కొత్తపల్లి: ఇటీవల సంభవించిన తుఫాను ప్రభావంతో సముద్రపు అలలు ఉప్పొంగి ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో పాటు తీర ప్రాంత రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సముద్రపు నీరు ఎస్పీజీఎల్ శివారు ప్రాంతంలోని పంట పొలాల్లోకి చొచ్చుకెళ్లడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు కోసం పెట్టిన పెట్టుబడులన్నీ నీటిపాలయ్యాయని వాపోయారు.
నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వాకతిప్పలో రైతులు ఆందోళనకు దిగారు. ఉప్పాడ–పిఠాపురం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సమాచారం అందుకున్న యు.కొత్తపల్లి తహసీల్దార్ చిన్నారావు, ఎస్సై వెంకటేష్ ఆందోళన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ చిన్నారావు, వ్యవసాయ అధికారి (ఏవో) జోగురాజుకు రైతులు తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని కోరారు.








కామెంట్లు (0)