సియోల్ (సౌత్ కొరియా) : గృహోపకరణాలు, నీరు, గాలి శుద్ధి పరికరాల సంస్థ కుకూ ఎలక్ట్రానిక్స్ (దక్షిణ కొరియా) ఓవర్సీస్ సేల్స్, మార్కెటింగ్ హెచ్‌వోడీ చో హన్ చుల్, ఆసియా రీజియన్ ప్రతినిధులతో రాష్ట్ర విద్యా ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ … శ్రీసిటీలోని గృహోపకరణాల క్లస్టర్ లో అంబర్, ఈప్యాక్ డ్యూరబుల్, డైకిన్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మొదలైన సంస్థలున్నాయన్నారు. దేశంలో 40 శాతం ఎసి లు, 35 శాతం టీవీలు ఆంధ్రప్రదేశ్ లో తయారవుతున్నాయని, ఇందుకు అవసరమైన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అందుబాటులో ఉందని తెలిపారు. ఇక్కడ నుంచి ఆగ్నేయ, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేయడం సులభం అని చెప్పారు. దక్షిణ భారతదేశంలో ఎసి ల వినియోగం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రపంచ వాణిజ్యానికి భారతదేశం ఒక విశ్వసనీయ తయారీ భాగస్వామిగా ఉందన్నారు. ఈ అనుకూలతల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసిటీ లేదా తిరుపతిలో గృహోపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. కుకూ ఎలక్ట్రానిక్స్ హెచ్‌వోడీ మాట్లాడుతూ … దక్షిణ కొరియాలో నంబర్ 1 ప్రెషర్ రైస్-కుక్కర్ల తయారీ సంస్థ అయిన కుకూ ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు నీరు, గాలి శుద్ధి, ఉపకరణాల అద్దె రంగాల వైపు మళ్లుతోందని తెలిపారు. వంటగది ఉపకరణాలు (IH ప్రెషర్ కుక్కర్లు), నీటి శుద్ధి (RO/నానో, WHO-గ్రేడ్), గాలి, ఆరోగ్యం (ప్యూరిఫైయర్లు, హ్యూమిడిఫైయర్లు, బిడెట్లు) తయారీతోపాటు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఉపకరణాల యూనిట్లు తమవద్ద అద్దెకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తమ సంస్థ 40కి పైగా దేశాలకు గృహోపకరణాలను ఎగుమతి చేస్తోందని తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా భారత మార్కెట్లో రైస్ కుక్కర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లను విక్రయిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామని వివరించారు.
ఎపి లో గృహోపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి : మంత్రి లోకేష్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 10, 2026, 10:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)