Big Bash League : ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్‌గా గుర్తింపు పొందిన భారత్ లోకి ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక టి 20 టోర్నీ బిగ్ బాష్ లీగ్ అడుగుపెట్టనుంది. విదేశీ క్రికెట్ లీగ్ భారత్‌లో మ్యాచ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ చారిత్రక నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడి, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అధికారికంగా ప్రకటించారు.
బిగ్‌బాష్ లీగ్ (బిబిఎల్) 2026-27 ప్రారంభ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. డిసెంబర్ 12న మెల్‌బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ విషయాన్ని మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడి, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సంయుక్తంగా ప్రకటించారు. భారత్–ఆస్ట్రేలియా మధ్య క్రీడా, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ‘జీ’డే నమస్తే’ కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా ... బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్ మరో దేశంలో జరగనుండడం ఇదే తొలిసారి. కాగా.. ఈ మ్యాచ్‌కు భారీ స్థాయిలో ప్రేక్షకులు వస్తారని ఆశిస్తున్నట్లు బిబిఎల్ నిర్వాహకులు తెలిపారు. భారత అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తుందని, ముఖ్యంగా చెన్నైలో క్రికెట్‌కు అపారమైన ఆదరణ ఉండటంతో స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోతుందని సిఎ బిగ్‌బాష్ లీగ్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ అలిస్టర్ డోబ్బన్ తెలిపారు. ఐపిఎల్ స్థాయిలో కాకపోయినా కూడా బిబిఎల్ ఇప్పటికే భారత ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుందని తెలిపారు. చెన్నై అభిమానులు తమ జట్టుకు మద్దతుగా పసుపు రంగు జెర్సీలతో స్టేడియానికి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందన్నారు. ఈ మ్యాచ్‌ను మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌కు హోం మ్యాచ్‌గా పరిగణిస్తారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఇరు జట్లు ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక ప్రయాణ ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. తద్వారా తదుపరి బిబిఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌పై ప్రభావం లేకుండా చూడాలని నిర్ణయించారు. పూర్తి బీబీఎల్ 2026-27 షెడ్యూల్‌ను వచ్చే వారం అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.
చెన్నైలో మ్యాచ్ నిర్వహించేందుకు పలు బిబిఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపినా ... ప్రయాణ భారం, వాణిజ్య అంశాలు, బిజీ షెడ్యూల్ వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుని చివరకు మెల్‌బోర్న్ రెనిగేడ్స్, పెర్త్ స్కోర్చర్స్ జట్లను ఎంపిక చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో ఇతర దేశాల్లో కూడా బిబిఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాలు పెరుగుతాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.








కామెంట్‌లు (0)