ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నోటీసుల విచారణలో తీవ్ర జాప్యం

05 సెప్టెంబర్, 2026

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 08:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఈనెల 10వ తేదీ డెడ్‌‌లైన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)లో నోటీసుల విచారణ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విచారణకు ఐదురోజులే గడువు ఉంది. ఈ ఐదు రోజుల్లో 20శాతం నోటీసుల విచారణ పూర్తి చేయాల్సి ఉంది. గత నెల 31కు నోటీసుల విచారణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికి సాధ్యం కాలేదు. దీంతో ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 44.28 లక్షల నోటీసుల్లో 99.99 శాతం ఇప్పటికే డెలివరీ అయ్యాయి. కేవలం 378 నోటీసులు మాత్రమే పంపిణీ కావాల్సి ఉంది. డెలివరీ అయిన నోటీసులకు సంబంధించి ఇప్పటివరకు 35.60 లక్షల విచారణలు పూర్తయ్యాయి. ఇది సుమారు 80 శాతంగా నమోదైంది. మిగిలిన 20 శాతం విచారణలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సి ఉంది. విచారణల పురోగతిలో కర్నూలు, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం, నంద్యాల, ఏలూరు జిల్లాలు ముందంజలో ఉన్నాయి.పల్నాడు జిల్లాలో 32.50 శాతం, ప్రకాశంలో 30.77 శాతం, తిరుపతిలో 30.39 శాతం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో 29.23 శాతం, వైఎస్సార్‌ జిల్లాలో 28.40 శాతం మాత్రమే విచారణలు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఓటు నమోదు కోసం వచ్చిన ఫారం-6 దరఖాస్తులు 2.35 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. ఫారం-7 ఓటు తొలగింపు, అభ్యంతరాలకు సంబంధించి 6,082 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఓటర్ల జాబితాలో పేరు, అడ్రస్, ఫోటో సవరణలు, ఒకే నియోజకవర్గంలో ఒక చోటు నుంచి మరో చోటికి మార్పు కోసం వచ్చిన ఫారం-8 దరఖాస్తులు 1.44 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. విచారణ ప్రక్రియలో వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, మిగిలిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీలోగా నోటీసులన్నింటి విచారణను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్