- మాజీ మంత్రి సాకే శైలజానాథ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయని, కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలై రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని అన్నారు. వర్షపాత లోటు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎటువంటి కంటింజెన్సీ ప్లాన్ లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కరవు వెంటే వస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారని, ఇప్పుడు అదే నిజమైందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 55 శాతానికి పైగా వర్షపాత లోటు ఉందన్నారు. ఎల్నినో పేరు చెప్పి కాలయాపన చేయడం తప్ప, రైతును ఆదుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికా లేదు. వరి వేయొద్దని చెప్పారు, తీరా చూస్తే వేరుశనగ, కంది వంటి ప్రత్యామ్నాయ పంటలు కూడా సాగు కాక రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. రాయలసీమలో 30 నుంచి 35 శాతం విస్తీర్ణంలో సాగు జరగలేదని తెలిపారు. నెల్లూరు బ్యారేజీ కింద వేసిన 3,500 ఎకరాల పంట నీళ్లు లేక ఎండిపోయిందని, కృష్ణా డెల్టాలో నార్లు ఎండిపోయే దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. శ్రీశైలంలో నీళ్లున్నా రాయలసీమ ప్రాజెక్టులకు సక్రమంగా నీళ్లివ్వలేని అసమర్థ పాలన సాగుతోందని అన్నారు.








కామెంట్‌లు (0)