ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కరువు కోరల్లో సిక్కోలు

1 గంట క్రితం

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 12:03 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- అడుగంటిన జలాశయాలు

- 56 రోజుల్లో 14 రోజులే వాన

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ఎల్‌నినో ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన 56 రోజుల్లో 14 రోజులు మాత్రమే వానలు కురిశాయి. ఒడిశాలో కూడా వర్షాలు లేకపోవడంతో వంశధార, నాగావళి నదుల్లో ఇన్ ఫ్లో బాగా తగ్గిపోయి జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటాయి. వంశధార ఎడమ కాలువ సామర్థ్యం 2,200 క్యూసెక్కులు కాగా, 1,600 కూసెక్కుల నీటిని, కుడి కాలువ సామర్థ్యం 850 క్యూసెక్కులు కాగా, 500 క్యూసెక్కుల వరకు నీటిని మాత్రమే విడిచిపెడుతున్నారు. దీంతో, ఎడమ కాలువ పరిధిలోని నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు, కుడి కాలువ పరిధిలోని గార మండలానికి నీరందడం లేదు. మడ్డువలస రిజర్వాయర్ లోకి ఇన్ ఫ్లో జీరోగా ఉంది. ఈ రిజర్వాయర్ కెపాసిటీ 3.73 టిఎంసిలు కాగా, డెడ్ స్టోరేజీ కింద 1.3 టిఎంసిల నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో, ఆయకట్టుకు చుక్క నీరు కూడా అందడం లేదు. పంటలు ఎండిపోతుం డడంతో తోటపల్లి ద్వారా నారాయణపురం కాలువకు 400 క్యూసెక్కుల నీటిని కుడి, ఎడమ కాలువలకు వదులుతున్నారు. తోటపల్లి రిజర్వాయర్ లోనూ నీటి నిల్వలు అంతంత మాత్రంగా ఉన్నాయి. రిజర్వాయర్ సామర్థ్యం 2.53 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 2.18 టిఎంసిల నీళ్లు ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం వద్ద పనులు జరుగుతుండటంతో శ్రీకాకుళం జిల్లా పరిధిలోని లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాల్లోని ఆయకట్టుకు నీరు విడిచిపెట్టడం లేదు. వానలు లేక, తోటపల్లి నీరు రాక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

డ్రమ్ములు, బిందెలతో

పంటలను కాపాడుకుంటున్న రైతులు

ఖరీఫ్ సీజన్ లో వర్షపాతం లోటు తీవ్రంగా ఉంది. ఈ సమయానికి 269.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 133.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. 50.4 శాతం లోటు ఉంది. జిల్లాలోని 12 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 15 మండలాల్లో తీవ్ర వర్షపాతం లోటు నమోదైంది. మూడు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వానలు పడకపోవడంతో పంటల సాగు పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సీజన్ లో 1,65,583 ఎకరాల్లో పంటలు వేయాలని లక్ష్యం కాగా, వ్యవసాయ లెక్కలు 1,19,341 ఎకరాల్లో మాత్రమే పంటలు వేసినట్టు తెలియజేస్తున్నాయి. పేరుకు పంటలు వేసినట్టు చెప్తున్నా సాగు నీరందక, వర్షాలు లేక ఎండిపోతున్నాయి. జొన్న, సజ్జ, రాగులు, ఉలవలు, నువ్వులు తదితర పంటలను ఒక్క ఎకరాలో కూడా రైతులు వేయలేకపోయారు. వరి నారుమళ్లు, వెదలు ఎండిపోతుండడంతో వాటిని కాపాడు కోవడానికి రైతులు నానా పాట్లు పడుతున్నారు. మోటార్లతోనూ, కొన్నిచోట్ల డ్రములతోనూ నీటిని తెచ్చి పంట పొలాలను తడుపుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహిళలు, పురుషులు బిందెలతో నీరు పోసి నారుమళ్లను, పంటలను బతికించుకొనేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్