ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవహ్వా వాక్కాయి

1 గంట క్రితం

vakkaya_87a087b562_v_jpg.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 08:50 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

వర్షాకాలంలో దొరికే వాక్కాయల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వగరు, పులుపు రుచుల కలబోతగా ఉండే ఈ చిన్న కాయలను మన దేశీయ ‘‘క్రాన్ బెర్రీస్’’ అని పిలుస్తారు. వీటిలో విటమిన్ ‘సి’ అత్యధిక పరిమాణంలో ఉంటుంది. ఇది వర్షాకాలంలో వచ్చే రోగనిరోధక శక్తి లోపాన్ని అరికట్టి, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. విటమిన్ ఎ, బి కంటిచూపును మెరుగుపరచడంతో పాటు నాడులవ్యవస్థకు విటమిన్ బి బలాన్నిస్తుంది. ఖనిజ లవణాలు, ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. మెగ్నీషియం, పొటాషియం వంటివి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పీచు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ వేగవంతమై, మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మైండ్ రిలాక్స్ అవ్వడానికి, ఒత్తిడి తగ్గడానికి తోడ్పడుతుంది. అందుకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటితో వాక్కాయ పప్పు, రోటి పచ్చడి, పులిహోర చేసుకోవచ్చు. మరి వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

pappu.jpg

పప్పు

కావాల్సినవి : కందిపప్పు – కప్పు, వాక్కాయలు – 10–12, పచ్చిమిర్చి – 4, ఉల్లిపాయ – 1, పసుపు – ¼ స్పూను, ఉప్పు – తగినంత, నీరు – తగినంత,

తాలింపు కోసం: నూనె – 1½ స్పూన్లు, ఆవాలు – ½ స్పూన్, జీలకర్ర – ½ స్పూన్, మినప్పప్పు – ½ స్పూన్, శనగపప్పు – ½ స్పూన్, ఎండుమిర్చి – 2,

కరివేపాకు – రెమ్మ, ఇంగువ – చిటికెడు.

తయారీ : ముందుగా కందిపప్పును కడిగి, పసుపు వేసి కుక్కర్‌లో 3–4 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. వాక్కాయలను కడిగి చివర్లు తీసి, చిన్న ముక్కలుగా కోయాలి. ఒక గిన్నెలో కొద్దిగా నీరు పోసి వాక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి మెత్తగా ఉడికించాలి. వాక్కాయలు మెత్తగా ఉడికిన తర్వాత ఉడికించిన పప్పును వేసి బాగా కలపాలి. అవసరమైనంత ఉప్పు, నీరు వేసి మరో 5 నిమిషాలు మరిగించాలి. వాక్కాయలోనే పులుపు ఉంటుంది. చిన్న బాండీ పొయ్యిమీద పెట్టి, నూనె పోసి, వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపును పప్పులో పోయాలి. ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచితే మంచి వాసనతో వాక్కాయ పప్పు సిద్ధం. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పప్పు తింటే అద్భుతంగా ఉంటుంది.

pacchadi.jpg

పచ్చడి

కావలసినవి : వాక్కాయలు – 1 కప్పు (గింజలు తీసి, ముక్కలుగా చేసుకున్నవి), పచ్చిమిర్చి – 8 నుండి 10 (కారానికి తగినట్లు), నువ్వులు – 2 స్పూన్లు, జీలకర్ర – స్పూను, వెల్లుల్లి రెబ్బలు – 5 లేదా 6, నూనె – 2 స్పూన్లు, ఇంగువ – చిటికెడు, పోపు దినుసులు (ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు) – అన్నీ కలిపి గుప్పెడు, పసుపు – అర స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర – కొద్దిగా,

తయారీ : వాక్కాయలను శుభ్రంగా కడిగి, మధ్యలోకి కోసి లోపల ఉండే గింజలను తొలగించి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. బాండీని పొయ్యిమీద పెట్టి, ఒక స్పూన్ నూనె వేసి వేడెక్కాక నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో వాక్కాయ ముక్కలు, పసుపు వేసి సన్నని మంటపై 4 నిమిషాలు మగ్గనివ్వాలి. కాయలు త్వరగానే మెత్తబడతాయి. కాబట్టి తీసి ప్లేట్‌ ‌లోకి తీసుకోవాలి. రోట్లో ముందుగా వేయించిన పచ్చిమిర్చి, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా తొక్కుకోవాలి. తర్వాత మగ్గించిన వాక్కాయ ముక్కలు, కొత్తిమీర వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నూరుకోవాలి. బాండీలో మిగిలిన నూనె వేసి కాగాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి పోపు వేయించి, ఆ తాళింపును పచ్చడిలో కలిపేయాలి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ వాక్కాయ రోటి పచ్చడితో తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది.

pulihora.jpg

పులిహోర

కావలసినవి : ఉడికించిన అన్నం – 2 కప్పులు, వాక్కాయలు – 1/2 కప్పు , పచ్చిమిర్చి – 4 (నిలువుగా చీల్చినవి), అల్లం తురుము – స్పూను, పసుపు – 1/2 స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 3 స్పూన్లు, పోపు కోసం: ఆవాలు – స్పూన్, మినపప్పు – 1 స్పూన్, శనగపప్పు – స్పూన్, వేరుశెనగ గుళ్లు (పల్లీలు) – 2 స్పూన్లు, ఎండుమిర్చి – 2, కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ – చిటికెడు.

తయారీ : ముందుగా వండుకున్న వేడి అన్నాన్ని ఒక వెడల్పాటి పళ్లెంలో పరిచి, దానికి కొద్దిగా నూనె, పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి చల్లారనివ్వాలి. కడిగి గింజలు తొలగించిన వాక్కాయలను తురుముకోవాలి. బాండీలో ఒక స్పూన్ నూనె వేసి, వాక్కాయ తురుమును సన్నని మంటపై 2-3 నిమిషాలు మగ్గనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో మిగిలిన నూనె వేసి వేడెక్కాక వేరుశెనగ గుళ్లు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం తురుము, కరివేపాకు, ఇంగువ వేసి మంచి సువాసన వచ్చే వరకూ వేయించాలి. ఈ పోపులో మగ్గించిన వాక్కాయ తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక్క నిమిషం తిప్పి స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టిన అన్నంలో వేసి, పోపు అన్నానికి బాగా పట్టేలా సవ్యంగా కలుపుకోవాలి. పులిహోర కలిపిన అరగంట తర్వాత తింటే వాక్కాయలోని సహజ సిద్ధమైన పులుపు అన్నానికి బాగా పట్టి రుచి రెట్టింపు అవుతుంది!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్