mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాయికృష్ణ కేసుపై సిట్

8 గంటల క్రితం

sit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 12:09 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో, విజయవాడ : విజయవాడలో గాదె సాయికృష్ణ కేసుపై విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన జిఓ 1215ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ ఆదివారం విడుదల చేశారు. డిజిపి కార్యాలయంలో ప్రొవిజినల్ అండ్ లాజిస్టిక్స్ ఐజిగా ఉన్న ఎం రవిప్రకాష్‌ను సిట్ అధిపతిగా నియమించారు. సభ్యులుగా పశ్చిమ గోదావరి ఎస్‌‌పి ఎ నయీంఅస్మి, అల్లూరి సీతారామ రాజు ఎస్‌‌పి అమిత్ బర్దర్, బాపట్ల అడిషనల్ ఎస్‌‌పి ఎల్ సుధాకర్‌‌ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. కృష్ణలంక సిఐ ఎస్ఎస్ వివి నాగరాజుపై వచ్చిన కస్టోడియల్‌ ‌టార్చర్‌, మర్డర్‌ వంటి ఆరోపణలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

విచారణ వేగవంతం..

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయికృష్ణ హత్య కేసులో ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. విజయవాడలోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల సిఐలకు ఒక్కో బాధ్యత అప్పగించింది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు సిఐ నాగరాజు ఎక్కడ ఉన్నారో పోలీసులకు తెలిసినప్పటికీ ఆయనను నేటికీ అరెస్టు చేయకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కేసులో ఇప్పటికే రెండు రోజులపాటు పోలీసులు పలువురి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. డిఎస్‌‌పి దైవప్రసాద్ నేతృత్వంలో ఒక బృందం సాయికృష్ణ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల వాగ్మూలం నమోదు చేసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది నుంచి, టాస్క్ ఫోర్స్ ఎడిసిపి లతాకుమార్ నుండి కూడా సమాచారం సేకరించింది. విజయవాడ పటమట ఇన్‌‌స్పెక్టర్ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో మరో బృందం కృష్ణలంక 'స్వర్గపురి' (స్మశాన వాటిక)కి వెళ్లి అక్కడ గత కొన్ని రోజులుగా వచ్చిన అనుమానాస్పద మృతదేహాలు, గుర్తుతెలియని శవాల రికార్డులను పరిశీలించింది. స్వర్గపురి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సిపి కెమెరాల ఫుటేజ్‌లను సేకరించి విశ్లేషించింది. సాయికృష్ణ తల్లి ఫిర్యాదు మేరకు సిఐ నాగరాజుపై కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసుతోపాటు ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసు కస్టడీలోనే సాయికృష్ణ చనిపోయాడని, ఆ తర్వాత మృతదేహాన్ని కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలో తగలబెట్టారనే ఆరోపణలు సాయికృష్ణ కుటుంబ సభ్యుల నుంచి, రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజల నుంచి వస్తోన్న నేపథ్యంలో ఆ కోణంలో డిజిటల్ ఎవిడెన్స్, సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే కేసులో రాజమండ్రి ఎస్‌‌పి నరసింహ కిషోర్, విజయవాడ ఎసిపి దైవప్రసాద్ పలు కోణాల్లో ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. స్వర్గపురి ప్రాంతంలోని సిసి కెమెరాల విజువల్స్, గుణదల పోలీసుల దర్యాప్తు, నవీన్ రెడ్డి హత్య కేసులో సాయికృష్ణకు ఉన్న సంబంధాలపై జగ్గయ్యపేట పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.

కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో సిఐ నాగరాజు!

సిఐ నాగరాజు గత మూడు రోజులుగా సింగ్‌‌నగర్‌ 58వ డివిజన్‌ ‌పరిధి షాదిఖానా సమీపంలోని ఒక కోర్ట్ హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉన్నట్లు సమాచారం. దీంతో, ఇక్కడ టాస్క్ ఫోర్స్ సర్వైలెన్స్ టీమ్ నిఘా ఉంచింది. కాగా, సిఐని ఆదివారం అరెస్టు చేస్తారనే ప్రచారంతో ఆయనకు మద్దతుగా కృష్ణలంకకు చెందిన టిడిపి, జనసేనకు చెందిన నాయకులు, కార్యకర్తలు సిఐ ఇంటి వద్దకు ఆదివారం చేరుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. సిఐను అరెస్ట్‌ ‌చేయొద్దని పెద్దయెత్తున ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది లతాకుమారి, సిఐ శ్రీధర్ వంటి వారు కూడా నాగరాజుకు సంఘీభావంగా అక్కడికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్