టమాటా తోట ధ్వంసం.. రైతుకు భారీ నష్టం
ప్రజాశక్తి – బైరెడ్డిపల్లి: బైరెడ్డిపల్లి మండలం వెంగంవారిపల్లి గ్రామ సమీపంలో ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేయడంతో టమాటా రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం సాయంత్రం రవి సాగు చేస్తున్న టమాటా తోటలోకి ప్రవేశించిన ఏనుగు పంటను ధ్వంసం చేసింది. పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో వేలాది రూపాయల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు రవి మాట్లాడుతూ.. ఒంటరి ఏనుగు సంచారం వల్ల పంటలు నష్టపోవడమే కాకుండా, తమ ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఏనుగు చుట్టుపక్కల గ్రామాల పరిసరాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందని గ్రామస్తులు తెలిపారు.
అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఒంటరి ఏనుగును జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఏనుగు సంచారాన్ని అరికట్టకపోతే పంట నష్టంతో పాటు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి, బాధిత రైతుకు ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






కామెంట్లు (0)