ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బుక్‌‌స్టాల్స్‌ పైకి బుల్డోజర్లు

-648 నిమిషాల క్రితం

బుక్‌‌స్టాల్స్‌ పైకి బుల్డోజర్లు
- బెంగాల్‌‌లో బిజెపి ప్రభుత్వ నిరంకుశత్వం
- పోలీసు బలప్రయోగంతో అన్ని స్టాల్స్‌ ఖాళీ
-సంఘ్ పరివార్‌ స్టాల్స్‌ జోలికి వెళ్లని అధికారులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 01:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- బెంగాల్‌‌లో బిజెపి ప్రభుత్వ నిరంకుశత్వం

- పోలీసు బలప్రయోగంతో అన్ని స్టాల్స్‌ ఖాళీ

-సంఘ్ పరివార్‌ స్టాల్స్‌ జోలికి వెళ్లని అధికారులు

కొల్‌‌కతా : పశ్చిమ బెంగాల్‌‌లో బిజెపి ప్రభుత్వం బరి తెగించింది. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గా దేవి మండపాల వద్ద సిపిఎం, వామపక్షాలు దశాబ్ధాలుగా ఏర్పాటు చేస్తున్న బుక్ స్టాల్స్‌ను కూల్చివేస్తోంది. బలవంతంగా ఖాళీ చేయిస్తోంది. బెంగాల్‌‌లో దసరా నవరాత్రుల సందర్భంగా సిపిఎం ఏర్పాటు చేసిన పుస్తకాల దుకాణాలను కూల్చివేయడానికి బుల్డోజర్లును, పోలీసులను బిజెపి ప్రభుత్వం వినియోగించింది. ప్రతీ ఏటా దుర్గా పూజ కోసం ఏర్పాటు చేసిన మండపాల వద్ద ప్రజల విజ్ఞానం, వికాసం కోసం సిపిఎం నేతృత్వంలో వామపక్షాలు బుక్‌‌స్టాల్స్‌‌ను ఏర్పాటు చేయడం కొన్ని ఏళ్ల నుంచి కొనసాగుతోంది. వీటికి ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ ఉంటుంది. అయితే ఈ ఏడాది వీటిని అడ్డుకోవడానికి బిజెపి ప్రభుత్వం నిరకుశంగా వ్యవహరించింది. నిజానికి ఈ ఏడాది దసరాలు ఉత్సవాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఏర్పాటు చేసిన సిపిఎం బుక్‌‌స్టాల్స్‌‌పై బిజెపి గుండాలు దాడులు చేస్తున్నారు. స్టాల్స్‌‌ను ధ్వంసం చేయడంతో పాటు సిపిఎం కార్యకర్తలపై భౌతికంగా దాడులకు దిగుతున్నారు. వీటిని సిపిఎం కార్యకర్తలు ప్రతిఘటిస్తున్నారు. స్టాల్స్‌‌ను మళ్లీ ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొల్‌‌కతాలో చోర్‌బగాన్‌ సర్బజనీన్‌ (సర్వజనీన) దుర్గా మండపంవద్ద శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాట తరువాత సిపిఎం బుక్‌‌స్టాల్స్‌‌పై ఏకంగా పోలీసులు, పౌర అధికారులు దాడులకు దిగారు. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న అన్ని స్టాల్స్‌‌ను ఖాళీ చేయించారు. స్టాల్స్‌‌ను తొలగించడానికి కొల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్లతో వచ్చారు. వాటిని ధ్వంసం చేశారు. పోలీసులు వామపక్ష పార్టీలు స్టాళ్లను ధ్వంసం చేసి, తగలబెట్టి, తొలగించారు. అయితే సంఘ్ పరివార్, బిజెపి నడుపుతున్న బుక్‌స్టాల్స్‌ ‌జోలికి మాత్రం అధికారులు వెళ్లడం లేదు.

సిపిఎం బుక్ స్టాళ్లను తొలగించడానికి కొల్‌కత్తా హైకోర్టు ఇచ్చిన ఒక సంకుచిత ఉత్తర్వును బిజెపి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నారని సిపిఎం నాయకులు విమర్శిస్తున్నారు. సిపిఎం బెంగాల్‌ ‌రాష్ర్ట కమిటీ సభ్యులు సుదీప్ సేన్‌గుప్తా మాట్లాడుతూ ‘మాకు పోలీసులు, కార్పొరేషన్ నుండి, అలాగే స్టాల్‌లో వినియోగించే విద్యుత్‌కు అనుమతి ఉంది. కానీ బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు’ అని తెలిపారు. హైకోర్టుకు దసరా సెలవులు ఇచ్చిన తర్వాత స్టాల్స్‌‌ను ఖాళీ చేయడానికి అధికారులు, పోలీసులు వచ్చారని విమర్శించారు.

లెఫ్ట్ ఫ్రంట్ సీనియర్ నాయకుడు బిమన్ బసు మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్బంగా బుక్‌‌స్టాల్స్‌‌ను ఏర్పాటు చేసే సంప్రదాయం డెబ్బై ఏళ్లకు పైగా కొనసాగుతోందని అన్నారు. “1952లో కొల్‌‌కతాలో మూడు పుస్తకాల స్టాళ్లతో ప్రగతిశీల మార్క్సిస్ట్ పుస్తకాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇది విపరీతంగా పెరిగింది, ఎందుకంటే ప్రజలు ఈ స్టాళ్లలో అనేక రకాల పుస్తకాలు కొంటారు” అని తెలిపారు. సిపిఎం (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ కూడా బిజెపి ప్రభుత్వ చర్యను విమర్శించింది. వామపక్షాలు నడుపుతున్న పుస్తకాల దుకాణాలను బిజెపి, ఆర్‌ఆర్‌ఎస్‌ ‌లక్ష్యంగా చేసుకున్నాయని, ఎందుకంటే వారు పుస్తకాలను చూసి భయపడుతున్నారని విమర్శించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్