- రూ.5 వేల కోట్ల విలువైన 31 వేల ఎకరాల భూములకు వివాదాల నుంచి విముక్తి
- పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం
- సిఎం చంద్రబాబునాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్వాకంతో చాలా భూములు వివాదాల్లోకి వెళ్లాయని... ఈ వివాదాలను పరిష్కరించడంతోపాటు... శతాబ్ద కాలం నుంచి వివాదాల్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజున రెవెన్యూ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పురపాలక, విద్యుత్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 232 సుదీర్ఘ కాలం పెండింగులో ఉన్న భూ వివాదాలను క్లియర్ చేశామని, వీటి విలువ సుమారు రూ. 5 వేల కోట్లు ఉంటాయని తెలిపారు. సుదీర్ఘంగా వివాదంలో ఉన్న 31 వేల ఎకరాలకు విముక్తి కల్పించామని చెప్పారు. జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంబాజీపేటలో గ్రౌండ్ రెంట్ భూముల అంశం 120 ఏళ్ల కాలం నాటి సమస్య అని, ఆ సమస్యను పరిష్కరించగలిగామన్నారు. ఈ వ్యవహారాల్లో ఎక్కడా అవినీతి లేకుండా భూ సమస్యల్ని పరిష్కరించాలన్నారు. మంత్రులు, అధికారులు ఈ సమస్యల్ని పరిష్కరించిన విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రీసర్వే ప్రక్రియ పూర్తైన భూములకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భద్రత కల్పించాలని సూచించారు. నవంబరు 1 తేదీ నుంచి రియల్ టైమ్ లో ఇంటిగ్రేషన్ చేసి. రెవెన్యూ సమస్యల పరిష్కారం.. ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. సిఎం సేతు కార్యక్రమాన్ని విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకూ విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలన్నారు. ఎపికి వచ్చే పరిశ్రమల్లో నైపుణ్యం ఉన్న మన యువతే ఉద్యోగాలు పొందేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఇప్పటి వరకూ 4.98 లక్షల మంది యువత నైపుణ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఐటిఐలు, పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు పరిశ్రమల్ని అనుసంధానించి అవసరమైన నైపుణ్యాలను పొందేలా చూడాలన్నారు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పైనా విద్యార్ధులకు నైపుణ్యం సాధించేలా అవగాహన కల్పించాలని సూచించారు. 2027 నాటికి అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా వందశాతం అక్షరాస్యతను సాధించాలన్నారు. స్వచ్ఛవాయు సర్వేక్షణ్ లో గుంటూరుకు జాతీయ స్థాయిలో రెండో స్థానం, నేషనల్ క్లీ్న్ ఎయిర్ సిటీస్ గా గుంటూరు, విజయవాడలోని వార్డులకు అవార్డులు వచ్చాయని తెలిపారు. రూ. 1.05 కోట్ల నగదు ప్రోత్సాహంతో పాటు... జాతీయ స్థాయిలో 5 అవార్డులు ఈ ఏడాది ఎపిలోని నగరాలు దక్కించుకున్నాయని వివరించారు. గుంటూరు, ఏలూరు, విజయనగరం, విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు నగరాల్లో అత్యుత్తమ పని తీరు ఉందని ప్రసంశించారు.








కామెంట్‌లు (0)