గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తాటి ఉత్పత్తుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

2 రోజుల క్రితం

kollu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 06:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- నీరా, తాటి బెల్లానికి ప్రోత్సాహం

- కల్లుగీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

- మంత్రి కొల్లు రవీంద్ర

పోలవరం: రాష్ట్రంలోని తాటి ఉత్పత్తుల అభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ చేపడుతోందని రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళవారం రంపచోడవరం మండలం పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన నీరా ప్రోత్సాహం – తాటి ఉత్పత్తుల అభివృద్ధి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ సిహెచ్ . శ్రీధర్, రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, రంపచోడవరం శాసనసభ్యులు లెజిస్ట్రేటివ్ చైర్మన్ మిరియాల శిరీష దేవి, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ధనుంజయ, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కె. సత్తిబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ కె. గురుమూర్తి, పెరికల సంఘం చైర్మన్ వి. వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. తాడి బోర్డు ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. మడ అడవుల్లో తాడి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు, తాటి కల్లును నీరాగా, తాటి బెల్లంగా విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చే కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లే, నీరాకు కూడా ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నీరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ పానీయమని, ప్రజల్లో దీనిపై విస్తృత అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. పందిరి మామిడి కృషి విజ్ఞాన కేంద్రాన్ని 1986లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఏర్పాటు చేశారని మంత్రి గుర్తు చేశారు. నిడదవోలు ఉద్యాన పరిశోధన కేంద్రంలో సంప్రదాయ పద్ధతిలో తాటి బెల్లం తయారీ జరుగుతుండగా, పందిరిమామిడి కేంద్రంలో ఆధునిక సాంకేతికతతో తయారీ చేపడుతున్నట్లు తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని, కల్లుగీత కార్మికుల జీవనోపాధి మెరుగుపడేలా అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ధనుంజయ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా తాడి జాతులు ఉన్నాయని, వాటి ద్వారా అనేక విలువైన ఉత్పత్తులు తయారవుతున్నాయని తెలిపారు. ఉద్యాన పంటల అభివృద్ధికి విశ్వవిద్యాలయం ద్వారా వేలాది మందికి శిక్షణలు అందించామని, శాస్త్రీయ పరిశోధనలతో నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి కృషి చేస్తున్నామని వివరించారు.

కృషి విజ్ఞాన కేంద్రంలోని తాడి ప్లాంటేషన్‌ను సందర్శించి, తాడి సాగు విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా కల్లుగీత కార్మికులు, తాడి రైతుల ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి, ఈఎస్ శ్రీలత, ఏఈఎస్ సుబ్రమణ్యం, అసిస్టెంట్ కమిషనర్ ఎం. వినయ్ బాబు, ఓఎస్‌డీ జవాలీ ఆల్ఫాన్స్, రంపచోడవరం ఆర్డీఓ కె. స్వాతి, డీఎస్పీ అశ్రఫ్ అలీ, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, కేవీకే కోఆర్డినేటర్ గోవర్ధన్, డాక్టర్ మమత, ఏపీఐఐసీ డైరెక్టర్ పెద్దిరాజు, మైనార్టీ డైరెక్టర్ షేక్ సుభాని, గౌడ డైరెక్టర్ వై. నారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు, శాస్త్రవేత్తలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కల్లుగీత కార్మికులు, తాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్