ఎస్పిలకు ఆదేశాలు
ఇతర రాష్ట్రాల నుండి బలగాలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థులను అడ్డుకునే అవకాశం ఉందంటూ వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు తగినంత భద్రత కల్పించాలని ఎస్పిలను ఆదేశించినట్లు తెలిపారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి పోలీసు బలగాలను రప్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు తెలంగాణ నుంచి సుమారు 20 వేల బ్యాలెట్ బాక్సులను తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాకు సీనియర్ ఐఎఎస్ అధికారిని సాధారణ పరిశీలకుడిగా, ఐఎఫ్ఎస్ అధికారిని వ్యయ పరిశీలకుడిగా నియమించనున్నారు. మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖకు కఠిన ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు.
24 గంటల్లో ధ్రువపత్రాలు..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన కుల, నో డ్యూస్, జనన ధ్రువపత్రాలను 24 గంటల్లో అందించేలా సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఎస్ఇసి చెప్పారు. సిసి కెమెరాల ఫుటేజీని గతంలో 30 రోజులు భద్రపరిచే విధానానికి బదులుగా 60 రోజులపాటు నిల్వ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఈ మార్పు చేసినట్లు వివరించారు. ఆన్లైన్లో నామినేషన్ల స్వీకరణను తరువాత జరిగే ఎన్నికల నుంచి అమలు చేసే అంశాన్ని పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు.
కొత్త పథకాలకు అనుమతి లేదు..
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించరాదని పునేఠా స్పష్టం చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు, పనులు కొనసాగుతాయని తెలిపారు. బదిలీలు, పోస్టింగ్లు, కొత్త పదోన్నతులపై నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఓటర్లు తమ పేర్లను జాబితాలో పరిశీలించుకుని, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల సంఘ కార్యదర్శి ఎ మల్లిఖార్జున, మున్సిపల్ అండ్ అడ్మినిస్ర్టేషన్ కమిషనర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు.







కామెంట్లు (0)