గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పొగాకు వేలం కేంద్రాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

2 రోజుల క్రితం

tobacco
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 05:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వర్జీనియా పొగాకు కొనుగోళ్లపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష

*అమరావతి : వర్జీనియా పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సామాజిక సంక్షేమ, విద్యుత్, రెవెన్యూ శాఖల మంత్రులతో పాటు టొబాకో బోర్డు చైర్మన్, టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆక్షన్ ప్లాట్‌ఫార్మ్‌ల పరిస్థితి, కొనుగోళ్ల పురోగతి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి సమగ్రంగా చర్చించారు. ఈ నెల 9న టొబాకో బోర్డు కేంద్ర సంయుక్త కార్యదర్శి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న నేపథ్యంలో రైతులు, పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అధిక రిజెక్షన్ నమోదవుతున్న ఆక్షన్ ప్లాట్‌ఫార్మ్‌లపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. పొగాకు వేలం కేంద్రాలను సంబంధిత సహచర మంత్రులు స్వయంగా సందర్శించి రైతులతో మాట్లాడాలని, కంపెనీల సిండికేట్ వ్యవహారాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఆక్షన్‌లలో పాల్గొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కంపెనీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డు అధికారులను మంత్రి ఆదేశించారు. రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం అందేలా, వర్జీనియా పొగాకుకు న్యాయమైన ధరలు లభించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రెవెన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్, విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, టోబాకో బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ, చైర్మన్ చిడిపోతు యస్వంత్ కుమార్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్