- మంత్రి మండిపల్లి
రాష్ట్రంలో మహిళల కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతూ 100 కోట్ల ఉచిత ప్రయాణాల మైలురాయిని అధిగమించడం పట్ల రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రారంభించిన స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందని మంత్రి తెలిపారు. గతేడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు నమోదుకావడం పథకం విజయానికి నిదర్శనమన్నారు. ప్రతిరోజూ సగటున 24 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని, ఇప్పటివరకు మహిళలకు సుమారు రూ.3,550 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలిగిందని మంత్రి పేర్కొన్నారు. మహిళలపై కుటుంబ ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గిస్తూ, వారి అవసరాలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించడంలో ఈ పథకం కీలకంగా మారిందన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను కేవలం హామీలుగా కాకుండా బాధ్యతగా భావించి అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మంత్రి స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ప్రభుత్వం ఆర్థికంగా కొంత భారాన్ని భరిస్తున్నప్పటికీ, మహిళల సంక్షేమం విషయంలో వెనుకడుగు వేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు.
ఆర్టీసీపై నెలకు సుమారు రూ.160 కోట్ల మేర భారం పడుతున్నప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం రూ.2,160 కోట్లను ఆర్టీసీకి చెల్లించడం ద్వారా పథకం అమలుకు పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ప్రభుత్వానికి భారంగా భావించకుండా, మహిళల సంక్షేమం కోసం బాధ్యతగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ పథకాలన్నింటిలోనూ విశేష ఆదరణ
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో స్త్రీ శక్తి పథకం మహిళల నుంచి అత్యధిక ఆదరణ పొందుతున్న పథకాలలో ఒకటిగా నిలిచిందని మంత్రి మండిపల్లి అన్నారు. మహిళలు తమ కుటుంబ అవసరాల కోసం, ఉద్యోగాలు, విద్య, వైద్యం, ఇతర పనుల నిమిత్తం ప్రయాణించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు.
మహిళల ప్రయాణ ఖర్చు తగ్గడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితికి కూడా ఈ పథకం అండగా నిలుస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మహిళా సంక్షేమం, సాధికారతకు స్త్రీ శక్తి పథకం ఒక మంచి ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు.
ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు
స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం, డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బందికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రోజుకు లక్షలాది మంది మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా మహిళలకు మరింత మెరుగైన సేవలు అందించేలా ఆర్టీసీని బలోపేతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్త్రీ శక్తి పథకం మరింత సమర్థవంతంగా అమలయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని, మహిళలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. స్త్రీ శక్తి పథకాన్ని ఆదరిస్తూ 100 కోట్ల ఉచిత ప్రయాణాల మైలురాయిని చేరేలా చేసిన రాష్ట్రంలోని ప్రతి మహిళకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల ఆశీస్సులతో ఈ పథకం మరింత విజయవంతంగా కొనసాగుతుందని ఆయన ఆకాంక్షించారు.








కామెంట్లు (0)