శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రీయింబర్స్‌మెంట్ బిల్లుల పరిష్కార వ్యవస్థ బలోపేతం

1 గంట క్రితం

ntr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 09:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఈహెచ్‌ఎస్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు త్వరలో 50 కోట్లు

- ​ఎన్టీఆర్‌ ‌వైద్య సేవల ట్రస్టు సిఇవో పద్మావతి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ​ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి అర్హులైన కుటుంబ సభ్యులకు మెడికల్ రీయంబర్స్‌మెంట్ బిల్లులను వేగంగా పరిష్కరించి వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటునట్లు ఎన్టీఆర్‌ వైద్య సేవల ట్రస్టు సిఇవో పద్మావతి వెల్లడించారు.గతంలో బిల్లుల పరిష్కారానికి ఏడాదికి పైగా సమయం పట్టేదని, కొన్ని కేసుల్లో 18 నెలల వరకు సమయం పట్టిందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది నవంబరు నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టడంతో ఇప్పుడు ఈ వ్యవధి నెల రోజులకు తగ్గిందని వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు 41,276 పెండింగ్‌ బిల్లులను పరిష్కరించినట్లు వివరించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇటీవల వరకు పరిశీలించిన బిల్లులు 22,600 వరకు ఉన్నాయని, వీటి విలువ రూ.152.95 కోట్ల వరకు ఉందని తెలిపారు. ప్రస్తుతం ట్రస్టు పరిశీలనలో సుమారు 1,500 బిల్లులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతినెల దాదాపు నాలుగు వేలకు పైగా మెడికల్ రీయంబర్స్‌మెంట్ బిల్లులు ట్రస్టుకు వస్తున్నాయని వెల్లడించారు. బిల్లుల పరిశీలనలో వివిధ దశలకు సంబంధించిన సమాచారాన్ని దరఖాస్తుదారులకు ట్రస్టు అధికారులు వాట్సాప్‌ ద్వారా తెలియజేస్తున్నారని, దీనివల్ల బిల్లుల స్థితిగతులపై దరఖాస్తుదారులకు అవగాహన ఏర్పడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, సంఘాలు, మండళ్లకు చెందిన 28 సంస్థలకు మెడికల్ రీయంబర్స్‌మెంట్ బిల్లుల పరిశీలన సేవలను విస్తరించినట్లు తెలిపారు. బిల్లుల సమర్పణ, పరిశీలన, పరిష్కారాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక ఆన్‌లైన్‌ విధానాన్ని రూపొందిస్తున్నారని వెల్లడించారు. దీని ద్వారా బిల్లుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించి, ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించనున్నారని తెలిపారు. ఈ విధానం అమలు కోసం సదరు ప్రభుత్వ శాఖలతో లోతుగా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) కింద ఆసుపత్రులకు నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత నెలలో ఇప్పటివరకు రూ.40 కోట్లు బదిలీ చేశారని, మరో రూ.50 కోట్లు త్వరలో విడుదల కాబోతున్నాయని వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్