కోల్‌కతా, ముంబయిలో లక్షలాది మందికి ముప్పు
ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు తీర ప్రాంత నగరాలకు తీవ్రమైన ముప్పుగా మారాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. వేగంగా సముద్ర మట్టాలు పెరుగుదల కారణంగా భారత్‌లోని కొల్‌కతా, ముంబయి, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో లక్షలాది మంది ప్రజలు తమ నివాసాలను కోల్పోయే ప్రమాదముందని పేర్కొంది. ముఖ్యంగా దక్షిణాసియాలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న కోట్లాది మంది తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారని పేర్కొంది. సముద్ర మట్టం పెరగడం ఇక భవిష్యత్తులో ఎదురయ్యే సమస్య కాదని, ఇప్పటికే దాని ప్రభావాలు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి కార్యాలయం నివేదిక స్పష్టం చేసింది.
అమెరికాలోని మియామి, న్యూయార్క్, చైనాలో గ్వాంగ్‌జౌ వంటి సంపన్న నగరాల్లో కోట్ల డాలర్ల విలువైన ఆస్తులు దెబ్బతినే ప్రమాదంలో ఉన్నాయని తెలిపింది. ఈ నగరాల్లో ప్రమాదంలో ఉన్న తీర ప్రాంత మౌలిక వసతుల విలువ 2 ట్రిలియన్ డాలర్ల నుంచి 3.5 ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. ముంబయి, కోల్‌కతా, ఢాకా వంటి నగరాల్లో 1.4 కోట్ల మందికిపైగా ప్రజలు శాశ్వతంగా నీట మునిగే పరిస్థితి కారణంగా తమ ఇళ్లను కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని, ఇది తక్షణమే ప్రభావం చూపించొచ్చని కూడా నివేదిక తెలిపింది. సముద్ర మట్టం పెరుగుదల వల్ల కేవలం ఆస్తి నష్టమే కాకుండా, ప్రజల వలసలు కూడా భారీగా పెరగొచ్చని, జీవనోపాధిపైనా ప్రభావం పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని హెచ్చరించింది.
సముద్ర మట్టాల పెరగడానికి కారణాలివే..
ముఖ్యంగా మానవ కార్యకలాపాల కారణంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ సముద్ర మట్టాల పెరుగుదలకు ప్రధాన కారణమని యూఎన్ రిపోర్ట్ వెల్లడించింది. ముఖ్యంగా హిమనీనదాలు (గ్లేసియర్లు) కరుగుతుండటం, ఉష్ణోగ్రత పెరుగుతుండటం వంటి అంశాలు సముద్ర మట్టం పెరుగుదలకు దోహదపడుతున్నాయి. 2014-2023 మధ్య ప్రపంచ సముద్ర మట్టం సగటున సంవత్సరానికి 4.7 మిల్లీమీటర్లు పెరిగింది. 2024లో ఒక్క సంవత్సరంలోనే సముద్ర మట్టం 5.9 మిల్లీమీటర్లు పెరిగింది. ఇది సరికొత్త రికార్డుగా చెబుతున్నారు. 2023-24 మధ్య సుమారు 5 మిల్లీమీటర్ల పెరుగుదలకు అసాధారణ సముద్ర ఉష్ణోగ్రతలు, ఎల్ నినో ప్రభావం ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 77 కోట్ల మంది, అంటే ప్రపంచ జనాభాలో సుమారు 10 శాతం మంది తీర ప్రాంతాల నుంచి 5 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని నివేదిక తెలిపింది. ఈ ప్రాంతాల్లో సముద్ర మట్టం పెరగడంతో తీర ప్రాంత వరదలు, మంచి నీటి వనరుల్లో ఉప్పునీరు చేరడం, పర్యావరణ వ్యవస్థలకు నష్టం వాటిల్లుతుండటం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.







కామెంట్‌లు (0)