ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పెండింగ్ బకాయిలు చెల్లించాలి : సిపిఎం
వీఆర్ పురం మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
ప్రజాశక్తి - వీఆర్ పురం: పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ ఆదివారం వీఆర్ పురం మండలానికి చేరుకుంది. ప్రజల నీరాజనాల మధ్య ర్యాలీ అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న పోలవరం ప్యాకేజీ డబ్బులను ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించకపోవడం దౌర్భాగ్యకరమన్నారు. పెళ్లయిన మహిళలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నిలిపివేయడం తగదని హెచ్చరించారు. అనంతరం లోతా రామారావు మాట్లాడుతూ, నిర్వాసితులను తరలించే నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మరో పెద్ద పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. వన్‌టైం సెటిల్‌మెంట్ చేసుకున్న నిర్వాసితులకు ఇప్పటివరకు సెటిల్‌మెంట్ డబ్బులు జమ చేయలేదన్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్ పేరుతో నిర్వాసితులను మభ్యపెట్టి ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. పునరావాసం అనంతరం పెన్షన్ పొందే నిర్వాసితులకు పెన్షన్ ఎక్కడ అందిస్తారు, ఓటర్ ఐడీ ఎక్కడ పొందాలి, రేషన్ ఎక్కడ అందుతుంది వంటి అంశాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదన్నారు. నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ప్రతి ఒక్క నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకు సీపీఎం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.








కామెంట్‌లు (0)