ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచదువుతో పాటు లౌకిక భావాలు..

55 నిమిషాల క్రితం

indian-kids-and-parents.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 11:18 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం సాధించాలి - ఇది చాలామంది తల్లిదండ్రుల లక్ష్యం. కానీ మార్కులతో పాటు మనిషితత్వం, సమానత్వం, ఇతరులను గౌరవించే స్వభావం కూడా నేర్పితేనే పిల్లల భవిష్యత్తు నిజంగా సురక్షితం అవుతుంది. అందుకే పేరెంటింగ్‌లో చదువుతో పాటు లౌకిక భావాలకు కూడా చోటు ఇవ్వాలి. ఇవి నేర్పడం అంటే పిల్లలను మనుషులుగా తీర్చిదిద్దడం.

లౌకిక భావాలు అంటే మతాన్ని ద్వేషించడం కాదు. అన్ని మతాలను, నమ్మకాలను గౌరవించడం; మతం పేరిట భేదభావం చూపకపోవడం; మనిషి మనిషికి సమానం అనే భావన; హేతువుతో ఆలోచించడం; ప్రశ్నించడం; శాస్త్రీయ దృష్టి పెంచుకోవడం; ఇతరుల బాధను అర్థం చేసుకోవడం. ఇవి పిల్లల్లో చిన్నప్పటి నుంచే అలవడాలి. అందుకు ముందుగా సమాయత్తం కావాల్సింది తల్లిదండ్రులు.

ఇంట్లో ఆచరణే ముఖ్యం

పిల్లలు మనం చెప్పేది కాదు, చూసే ఎక్కువ నేర్చుకుంటారు. ఇంట్లో ఒక మతం లేదా కులం పట్ల భేదభావం ఉంటే, పుస్తకాలతో దాన్ని మార్చలేము. “వాళ్లు అలా ఉంటారు” అనే మాటలు, ప్రవర్తన పిల్లల మనసులో లోతుగా నిలిచిపోతాయి. పెద్దవాళ్లుగా ఆచరణలో అలాంటి మతం లేదా కులం పట్ల భేదభావం చూపకుండా ఉండాలి. అప్పుడు పిల్లల్లో ఆ భావాలు బలంగా నాటుకుంటాయి.

అన్ని మతాల పరిచయం

పిల్లలకు వివిధ పండుగలు, ప్రార్థనలు, కథలు పరిచయం చేయండి. ఏ మతం గొప్ప, ఏది కాదు అని నేర్పకండి. “మనం ఇలా ఆచరిస్తాం; వాళ్లు అలా ఆచరిస్తారు. అందులో తప్పు లేదు” అని చెప్పండి. ఇది పిల్లల్లో పరస్పర గౌరవాన్ని పెంచుతుంది. మనుషులంతా ఒక్కటే అనే భావన కలిగించాలి. ఇది పసితనంలోనే అలవడటం వల్ల మంచి పౌరులుగా తయారవుతారు.

ప్రశ్నించడం నేర్పండి

పిల్లలు “ఎందుకు?” అని అడగడం తప్పు కాదు. వాళ్ల ప్రశ్నలను కాదనకండి. శాస్త్రం, చరిత్ర, సమాజం గురించి చర్చించండి. మూఢనమ్మకాలు, అసమానతలపై సున్నితంగా మాట్లాడండి. హేతువుతో ఆలోచించే అలవాటు పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది. సహజంగా పిల్లలకు సందహాలు రావడం మంచి పరిణామం. విసుగు చెందకుండా వారి సందేహాలను నివృత్తి చేయడమే మంచి పేరెంటింగ్‌.

సమానత్వం చూపండి

ఇంట్లో పనులు అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా చేయించండి. వేరే మతం, కులం, ప్రాంతం, భాష, శారీరక స్థితి ఉన్న పిల్లలతో స్నేహం చేయడానికి ప్రోత్సహించండి. “అందరం సమానం” అనే భావన పిల్లల్లో బలపడాలి. ఈ విషయంలో చెప్పిన దానికన్నా తల్లిదండ్రుల ఆచరణలో వ్యవహరిస్తున్నదాన్నే పిల్లలు అందిపుచ్చుకుంటారు.

మీడియా విమర్శనాత్మక దృష్టి

టీవీ, సోషల్ మీడియాలో మతం, కులం పేరిట ద్వేషం ప్రచారం చేసే కంటెంట్ ఉంటుంది. పిల్లలతో కలిసి చూసి, “ఇది ఎంతవరకు నిజం? ఎవరికి లాభం? ఇది అందరినీ కలుపుతుందా, విభజిస్తుందా?” అని చర్చించండి. చర్చించడం వల్ల వాళ్లకు సరైన అవగాహన కలుగుతుంది. ఆయా సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో, ఏది సరైనదో తెలుసుకుంటారు. వాస్తవికమైన ఆలోచనా దృష్టి అలవడుతుంది.

సేవ, భాగస్వామ్యం

అన్ని మతాల పండుగల్లో, సామాజిక సేవలో పాల్గొనండి. పేదవారికి సహాయం, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, పర్యావరణ కార్యక్రమాల్లో పిల్లలను కలుపుకోండి. ఇతరుల బాధను అర్థం చేసుకునే గుణం అలవడుతుంది. సహానుభూతి పిల్లలకు కలిగించడం వల్ల ఐక్యతా భావం అలవడుతుంది.

చదువు ఉద్యోగం ఇస్తుంది; లౌకిక భావాలు మనిషిత్వాన్ని ఇస్తాయి. రెండూ కలిస్తేనే సమాజానికి మంచి పౌరులు, మంచి నాయకులు తయారవుతారు. పేరెంటింగ్‌లో చిన్న చిన్న అలవాట్లే పెద్ద మార్పు తెస్తాయి. అందుకే పిల్లలకు చదువుతో పాటు లౌకిక భావాలు నేర్పడం ఈ తరం తల్లిదండ్రుల బాధ్యత.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్