శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థి ఉద్యమం మోడీకి చెంపపెట్టు

1 గంట క్రితం

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 12:59 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ​రాష్ర్ట ప్రయోజనాల కోసం చంద్రబాబు పోరాడాలి : వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమం సాధించిన అతి పెద్ద విజయమని సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వి. శ్రీనివాసరావు కొనియాడారు. విద్యార్థి ఉద్యమం ఎదుట మోడీ సర్కార్ మోకరిల్లక తప్పలేదని, ఈ పరిణామం ఒక చెంపపెట్టు లాంటిదన్నారు. శనివారం నెల్లూరు, కావలిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఇటీవల కాలంలో విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం, దేశం మొత్తాన్ని ప్రభావితం చేయడం, ఒక్క మాటలో చెప్పాలంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని సైతం కదిలించిన పోరాటం అని అన్నారు. ఈ ఉద్యమం ప్రారంభం మాత్రమేనని, యువత, విద్యార్థులు చూపుతోన్న దేశభక్తి అందరి మన్ననలు పొందుతున్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ర్ట హక్కుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోరాటం చేయాలని హితవు పలికారు. మోడీ భజన చేయడం మాని రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలని, పరీక్ష విధానాలను రాష్ట్రాలకు అప్పగించాలని, పరీక్షా విధానాన్ని (డీ సెంట్రలైజేషన్ ) వికేంద్రీకరణ చేయాలని, ఢిల్లీలో మృతి చెందిన విద్యార్థులే కాకుండా నీట్ పరీక్ష పత్రం లీకేజీ కారణంగా మరణించిన విద్యార్థుల కుటుంబాలకు నష్ట పరిహారం అందజేయాలని, ఒక్కొక్క కుటుంబానికి రూ. కోటి రూపాయలు పరిహారం అందజేయాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యా మాఫియాను అంతం చేయకపోగా, కేంద్ర ప్రభుత్వాన్ని విద్యామాఫియా నడిపించే స్థాయికి ఎదిగిందని విమర్శించారు. మంత్రులు సైతం ఆ మాఫియా చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తన రాజీనామాను సమర్థించుకుంటూ..విద్యార్థి ఉద్యమం జాతీయ వ్యతిరేకుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకే తాను తప్పుకున్నానని చెప్పడం హేయమన్నారు. చేసిన తప్పును ఒప్పుకోకుండా విద్యార్థులు, యువతపై నిందలు వేయడం సరికాదన్నారు. కోట్లాది రూపాయలు వసూలు చేసి నీట్ పరీక్షా పత్రాలను హైజాక్ చేసిన విద్యామాఫియా జాతీయ వ్యతిరేకులా? లేక విద్యావ్యవస్థను, పరీక్షా విధానాలను ప్రక్షాళన చేసి అందరికీ న్యాయం చేయాలని పోరాడుతున్న విద్యార్థులు జాతీయ వ్యతిరేకులా? అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జీని పరిశీలించాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, తమకంత సమయం లేదంటూ ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్) మాట్లాడే దుస్థితిని కేంద్ర ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. అయితే, ఒకప్పుడు తమకు తీరిక లేదని ప్రకటించిన అదే కోర్టు, నేడు అనివార్యమైన పరిస్థితుల్లో ఈ అంశాన్ని విచారణకు స్వీకరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

వైసిపి తన వైఖరి మార్చుకోవాలి

ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టది మరోదారి అన్నట్టు వైసిపి వైఖరి ఉందని శ్రీనివాసరావు విమర్శించారు. దేశమంతా నీట్ అక్రమాలపై విద్యార్థి లోకం పోరాడుతుంటే వైసిపి మాత్రం దాని గురించి పట్టించుకోకుండా, ఆ ఉద్యమంలో భాగస్వామి కాకుండా పార్లమెంటులోనూ బయటా వేరే విషయాలపై మాట్లాడుతూ టిడిపి భాగస్వామిగా ఉన్న మోడీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు పూనుకుంటుందని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన విషయాలను అసెంబ్లీకి హాజరై ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఢిల్లీలో మాట్లాడితే ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికైనా వైసిపి తన వైఖరిని మార్చుకుని రాష్ట్రంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావాలని సూచించారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు షేక్ రెహనాబేగం పాల్గొన్నారు.

అలుపెరుగని పోరాటయోధుడు 'పముజుల’

​ప్రజాహక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి సిపిఐ నెల్లూరు మాజీ జిల్లా కార్యదర్శి పముజుల దశరధరామయ్య(96) అని, ఆయన మృతితో ఒక ప్రజాఉద్యమ నేతను కోల్పోయామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. వయోభారంతో శుక్రవారం ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. సౌత్ మోపూర్ సర్పంచ్ గా సుదీర్ఘకాలం పనిచేసి, రూరల్ ఎంపిపిగా పనిచేసి ఆ పదవులకే వన్నే తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి దశరధరామయ్య అని కొనియాడారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్