సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కొండలెక్కితేనే చదువు..!

1 గంట క్రితం

manyam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 11:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- కోసంగూడలో పాఠశాల లేక 25 మంది గిరిజన చిన్నారుల నిత్యం ప్రాణాల మీద నడక

- ఏళ్లుగా వినతులు.. స్పందించని అధికారులు

– కోసంగూడలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని గ్రామస్తుల డిమాండ్

ప్రజాశక్తి - కురుపాం : మన్యం జిల్లా కురుపాం మండలంలోని వబ్బంగి గ్రామపంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామాలు కోసంగూడ, రెల్లిగూడ, తాడిగండ గ్రామలకు చెందిన 25 మంది గిరిజన చిన్నారుల విద్యాభ్యాసం నేటికీ కష్టాల నడుమ సాగుతోంది. ఈ మూడు గ్రామాల్లో పాఠశాల లేకపోవడంతో విద్యార్థులు ప్రతిరోజూ కొండలు, కోనలు, అడవి దారులు దాటి కాకిలి గ్రామంలోని పాఠశాలకు కాలినడకన వెళ్లి తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నారులు విద్య కోసం నిత్యం ప్రమాదకర మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం కోసంగూడ గ్రామానికి చెందిన మండంగి గణపతి తదితరులు ప్రజాశక్తి విలేకరతో మాట్లాడుతూ, కోసంగూడలో పాఠశాల ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్, ఐటిడిఏ పీవోలకు వినతిపత్రాలు అందజేసినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము గిరిజనులమని, కొండపోడు వ్యవసాయమే జీవనాధారమని, రోజంతా కొండ ప్రాంతాల్లో పనులు చేయాల్సి రావడంతో పిల్లలను ప్రతిరోజూ పాఠశాలకు తీసుకెళ్లడం, తీసుకురావడం సాధ్యం కావడం లేదన్నారు. దీంతో చిన్నారులు ఒంటరిగానే అడవి మార్గంలో నడిచి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, అడవి జంతువులు, విషసర్పాలు, ఇతర ప్రమాదాల భయం నిత్యం వెంటాడుతోందని చెప్పారు. పిల్లల చదువుతో పాటు వారి భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు.

గిరిజన ప్రాంతాల విద్యాభివృద్ధిపై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఈ మూడు గ్రామాల చిన్నారులకు కనీస పాఠశాల సౌకర్యం కూడా కల్పించలేకపోవడం విచారకరమని గ్రామస్తులు విమర్శించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి కోసంగూడలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసి, అవసరమైన ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేసి గిరిజన చిన్నారుల విద్యకు అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్