ఆదివారం, 11 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తగ్గేది లేదు

1 గంట క్రితం

cjp.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 12:01 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు పోరాటం

  • ఇంతటి భయపడే ప్రధాని దేశంలో ఎన్నడూ లేరు

  • సిజెపి నేతలు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఆందోళనల నుంచి వెనక్కి తగ్గేది లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) జాతీయ కో క‌న్వీన‌ర్లు అశుతోష్ రాంకా, సౌరవ్‌ దాస్ స్పష్టం చేశారు. ఢిల్లీలో పోలీసులు తమను నిర్బంధించినప్పటికీ, ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఆదివారం పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన అనంతరం ప్రెస్ క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వారు మాట్లాడారు. దేశంలో ఇంతటి భయపడే ప్రధానిని ఎన్నడూ చూడలేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యవహారశైలి దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని విమర్శించారు. వేలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకోవడం, వారిపై దాడులు చేయడం, ప్రజల రాకపోకలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను విమానంలోనే నిర్బంధించడం సాధారణ పోలీసు చర్య కాదని, తమ స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ గురించి గతంలో విన్నామని, గత 72 గంటల్లో జరిగిన పరిణామాలు అప్పటి పరిస్థితులను తలపిస్తున్నాయని అన్నారు. రైలు సేవలకు అంతరాయం కలిగించడం, ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం, నిరసనకారులను పెద్దఎత్తున నిర్బంధించడం ప్రజాస్వామ్య దేశంలో ఆమోదయోగ్యం కాదన్నారు.

అమానవీయంగా వ్యవహరించారు

అభిజిత్‌ దీప్కే నిర్బంధంలో ఉన్న సమయంలో ఆయన నానమ్మ మరణవార్తను పోలీసులు తెలియజేసిన తీరుపై అశుతోష్‌ రంకా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్‌ పింప్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మరణించారని తెలిపారు. వ్యక్తిగత విషాదాన్ని తెలియజేసే సమయంలోనూ పోలీసులు అమానవీయంగా వ్యవహరించారని అన్నారు. ఆ సమయంలో ఆయన చుట్టూ కెమెరాలు, మైక్రోఫోన్లు ఉంచి ఆ దుఃఖకరమైన సందర్భాన్ని ప్రదర్శనగా మార్చారని విమర్శించారు.

పోరాటం ఆగదు

సౌరవ్‌ దాస్‌ మాట్లాడుతూ, తమను నిర్బంధించినంత మాత్రాన ఉద్యమాన్ని నిలువరించలేరని స్పష్టం చేశారు. దేశ యువత మేల్కొందని, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టాలని కోరుకుంటోందని అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ప్రారంభమైన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఓటర్ల పేర్ల తొలగింపుపై ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ఓటు హక్కును పరిరక్షించాలని కోరారు. నిరసనకారులపై పోలీసులు దాడులు చేయడం, వారిని అక్రమంగా నిర్బంధించడం వంటి చర్యలు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను మరింత పెంచుతాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న యువతను భయపెట్టలేరని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన సంస్థ అని, అది అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించకూడదని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులకు కలిగిన నష్టానికి బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తోందని, యువత మరింత పట్టుదలతో పోరాటానికి సిద్ధమవుతోందని చెప్పారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బహిరంగ ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని విమ‌ర్శించారు. ఆంక్షలతో నిరసనకారులే కాకుండా సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఢిల్లీని ఒక కంటోన్మెంట్‌గా మార్చివేశారని, నగరవ్యాప్తంగా 30 వేల నుంచి 40 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారని ఆరోపించారు. కాశ్మీర్‌, పశ్చిమ బెంగాల్‌, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి కూడా భద్రతా సిబ్బందిని తీసుకొచ్చార‌ని తెలిపారు.

సిజెపి నేతల‌ విడుద‌ల‌

కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) జాతీయ క‌న్వీన‌ర్‌ అభిజీత్ దీప్కే, కో క‌న్వీన‌ర్లు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకాలను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. ఆదివారం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడకూడదనే షరతుతో వారిని విడుదల చేశారు. ఈ ముగ్గురు నాయకులు శనివారం ముంబయి నుంచి ఢిల్లీకి విమానంలో చేరుకోగా, పోలీసులు విమానంలో ప్రవేశించి నిర్బంధించిన సంగతి తెలిసిందే.

బెయిల్‌పై విడుదల

అంతకుముందు అభిజిత్ దీప్కే, సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకాలను ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ సన్మిత్ర ఎదుట ఆదివారం పోలీసులు హాజరుపరిచారు. ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడబోమనే షరతుతో కూడిన నిర్దిష్ట నమూనా బాండ్‌పై సంతకాలు తీసుకున్న అనంతరం వారిని విడుదల చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్