- రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతు
- పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి
- హార్టీకల్చర్ హబ్‌కు నిధులు ఇవ్వండి
- మేధో మథన కేంద్రంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్
- కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్ధాలను స్థిరీకరించేందుకు కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను కేంద్రమంత్రి దృష్టికి సిఎం తీసుకొచ్చారు. లక్షలాది మంది రైతులు, కార్మికులు, ప్రాసెసింగ్ కేంద్రాలు, ఎగుమతి దారులు, హేచరీలు, మేత తయారీ దారులు ఇతర అనుబంధ రంగాలకు ఆక్వా పరిశ్రమ ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. మేత లభ్యతలో చిన్న అంతరాయం కూడా ఆక్వా రైతుల మనుగడ, ఎగుమతులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోందని తెలిపారు. రొయ్య మేత తయారీదారుల సంఘం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది జనవరి- ఏప్రిల్ మధ్య కాలంలో రొయ్య మేత ధరలు భారీగా పెరిగాయని ఫలితంగా ఉత్పత్తి వ్యయం 20 శాతం కంటే ఎక్కువగా పెరిగిందన్నారు. ధరల అదపునకు ఓ సంస్థాగత ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ తో ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రోడ్యూసర్స్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎన్ఎఫ్‌డిబి ద్వారా నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలను తగ్గించేలా కేంద్రం సంప్రదింపులు జరపాలని సీఎం అభ్యర్ధించారు. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యలపై 5.77 శాతం కౌంటర్ వెయిలింగ్ డ్యూటీని అమెరికా విధించిందని అలాగే యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా వేసేందుకు ఆలోచన చేస్తోందని తెలిపారు. భారత్ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యల్లో 80 శాతం ఏపీ నుంచే వెళ్తున్నాయని, రెసిప్రోకల్ టారిఫ్ విధిస్తే రాష్ట్రంలోని 30 లక్షల మంది ఆక్వా కల్చర్ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధి దెబ్బ తినే ప్రమాదం ఉందన్నారు. అమెరికాకు చేసే రొయ్య ఎగుమతులను కాపాడేందుకు సీఫుడ్‌పై ప్రస్తుతం ఉన్న 30 శాతం కస్టమ్స్ సుంకాన్ని సున్నాకు తగ్గించాలని లేదా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దానిని మినహాయించాలని విజ్ఞప్తి చేశారు.
పన్ను భారం తగ్గించండి
వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చినప్పటి నుంచి పొగాకు ఉత్పత్తులను అత్యధిక పన్ను శ్లాబులో ఉంచటం పొగాకు రైతులపై నేరుగా ప్రభావం చూపిస్తోందని కేంద్ర ఆర్ధిక మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో గత సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది వేలం ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని వివరించారు. తయారీ దారుల కొనుగోళ్లు తగ్గించటంతో రైతు కూలీలు, వేలం కేంద్రాల కార్మికులు, రవాణాదారులు, ఎంఎస్‌ఎంఈ రంగాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఏడాది 230 మిలియన్ కేజీల ఉత్పత్తికిగానూ కేవలం 34 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోళ్లు జరిగాయన్నారు. తక్షణం పొగాకు రైతులను ఆదుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
హార్టీకల్చర్ హబ్‌కు సహకారం
రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ డెవలప్మెంట్ ప్లాన్‌కు కేంద్రం నుంచి పూర్తి సహకారం అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, సత్యసాయి, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి సహా ప్రకాశం, మార్కాపురం జిల్లాలు ఉద్యాన ఉత్పత్తిలో 55 శాతం వాటాను కలిగి ఉన్నాయని వివరించారు. 2030 నాటికి సాగు విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచటంతో పాటు ఉద్యాన ఉత్పత్తులను 435 లక్షల టన్నులకు పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు. 201 ఉద్యానవన క్లస్టర్ల ద్వారా రూ. 14,906 కోట్ల పెట్టుబడి ద్వారా 9 లక్షల మంది రైతులకు లబ్ది కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో నీటి భద్రత కోసం రూ.20,884 కోట్ల వ్యయంతో 23 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని. తద్వారా 9 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు, 4.3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. వచ్చె నెల 6, 7 తేదీల్లో హార్టీకల్చర్ హబ్ పనులు ప్రారంభించనున్నామని ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. రాయలసీమ సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను ప్రతిపాదించామని వివరించారు. రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఐఎస్ఏ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.








కామెంట్‌లు (0)