కానిస్టేబుల్‌పై ఎఫ్‌ఐఆర్
పాట్నా : నీట్ లీకేజికి కారణమైన ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా కోరుతూ విద్యార్థులు చేసిన పోరాటాలపై పోలీసుల దాష్టికాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బీహార్‌లో శనివారం జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఒక కానిస్టేబుల్‌పై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. రాష్ర్టంలోని సివాన్‌లో శనివారం నిరసనల్లో కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ ఎకె-47 అసాల్ట్ రైఫిల్‌తో గాలిలోకి కాల్పులు జరుపుతున్న వీడియో వెలుగులోకి రావడంతో, ఆయనను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ నిరసనల్లో మొత్తం పది రౌండ్ల కాల్పులు జరిగాయని సివాన్ ఎస్పి పూరన్ కుమార్ ఝా మీడియాకు వెల్లడించారు. ‘‘పోలీసుల వైపు నుండి, లాంగ్-రేంజ్ ఆయుధాల ద్వారా నాలుగు రౌండ్లు, పిస్టల్స్ ద్వారా మూడు రౌండ్ల కాల్పులు జరిగాయి. మొత్తంగా పది రౌండ్ల కాల్పులు జరిగాయి. మిగిలిన కాల్పులు ఎక్కడి నుండి జరిగాయనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నాం’’ ఝా పేర్కొన్నారు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ ఒక హత్య కేసుపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న జిల్లా ఇంటెలిజెన్స్ యూనిట్ (డిఐయు)లో బాధ్యతలు నిర్వహిస్తున్నారని, శనివారం జెపి చౌక్ వద్ద నిరసనల్లో అనుకోకుండా చిక్కుకుపోయారని అధికారులు అంటున్నారు. కాల్పులు జరపడానికి కుమార్‌కు ఎలాంటి ఆదేశాలు లేవని, నిజానికి అటువంటి ఆయుధాన్ని బహిరంగ ప్రదేశానికి తీసుకువెళ్లి కూడదని కూడా అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. అయితే ఈ కాల్పుల ఘటనా స్థలానికి సమీపంలోని ఇతర ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులకు తుపాకీ గాయాలైనట్లు వార్తలు రావడం గమనార్హం. జెపి చౌక్‌కు సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో 17 ఏళ్ల మహ్మద్ ఆరిఫ్, 22 ఏళ్ల ఆకాష్ కుమార్‌తో పాటు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న 20 ఏళ్ల కుమార్ గౌర్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. వీరు చికిత్స తరువాత కోలుకున్నారు.








కామెంట్‌లు (0)