సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకదంతొక్కిన నిరుద్యోగులు..

1 గంట క్రితం

dyfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 10:43 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, కలెక్టరేట్‌ ముట్టడి

  • 11,638 పోస్టులతో మెగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల డిమాండ్

  • కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ

ప్రజాశక్తి- కర్నూలు కలెక్టరేట్ : పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పది వేలకు పైగా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ నిరుద్యోగ అభ్యర్థులు సోమవారం కదంతొక్కారు. కర్నూలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బిర్లా కాంపౌండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న ఎన్టిఆర్ సర్కిల్‌లో వాహనాలను నిలిపివేసి గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ కు చేరుకొని ప్రధాన గేట్ల వద్ద బైఠాయించారు. ఉదయం 11.00 గంటల నుండి ప్రారంభమైన ఈ ఆందోళన దాదాపు ఐదు గంటలపాటు కొనసాగింది. కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు నిరుద్యోగులు, డివైఎఫ్ఐ నాయకులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తొలుత డిఆర్ఒ వెంకట్ నారాయణమ్మ వినతిపత్రం స్వీకరించేందుకు రాగా, కలెక్టర్ స్వయంగా వచ్చి స్వీకరించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని డివైఎఫ్ఐ ప్రతినిధి బృందాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి వద్దకు తీసుకెళ్లారు. వినతిపత్రం స్వీకరించిన కలెక్టర్... నిరుద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీనికి ముందు నిరసన కార్యక్రకమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, నాయకులు రంగప్ప మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను టిడిపి కూటమి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. 20 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నాయని తొలుత పేర్కొన్నారని, కానీ వెబ్ నోట్‌లో 11,638 పోస్టులు ఉన్నట్లు చూపించారని, తాజాగా విడుదల చేసిన జాబ్ కేలండర్ లో 2,500 పోస్టులను మాత్రమే పేర్కొనడం నిరుద్యోగులను మోసగించడమేనని విమర్శించారు. తక్షణమే 11,638 పోస్టులతో మెగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఈ నెల 30న 'చలో విజయవాడ' కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి.రాఘవేంద్ర అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు హుస్సేన్ బాషా, సహాయ కార్యదర్శి ప్రకాష్, వందలాది మంది నిరుద్యోగులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్