అదరగొడుతున్న బాక్సర్లు
లాంగ్ జంప్ ఫైనల్‌కు శ్రీశంకరన్
23వ కామన్వెల్త్ క్రీడలు
గ్లాస్గో: 23వ కామన్వెల్త్ క్రీడల్లో 5వ రోజు భారత్ ఖాతాలో మరో రెండు రజత పతకాలు జమ అయ్యాయి. ఈ రెండు పతకాలు వెయిట్ లిఫ్టింగ్‌లోనే దక్కడం విశేషం. మీరాబాయి చాను, రిషికాంత సింగ్ ఇప్పటికే ఈ విభాగంలో పతకాలు సాధించగా.. తాజాగా జ్ఞానేశ్వరీ యాదవ్, ముత్తుపాడి దేశానికి మరో రెండు రజత పతకాలను అందించారు. సోమవారం జరిగిన మహిళల 53 కిలోల విభాగం ఫైనల్లో జ్ఞానేశ్వరి నైజీరియా లిఫ్టర్‌కు దాదాపు సరిసమానంగా బరువులెత్తిన ఆమె రెండో స్థానంతో సరిపెట్టుకుంది. తొలి ప్రయత్నంలో జ్ఞానేశ్వరి యాదవ్ 82 కిలోలు ఎత్తింది. మూడో ప్రయత్నంలో 85, మూడోసారి 88 కిలోలతో రికార్డు నెలకొల్పింది. మరికొద్దిసేపటికే నైజీరియా లిఫ్టర్ ఒనొమె ఒమొలోలా దిదిహ్ ఏకంగా 90 కిలోలు ఎత్తి ఆధిక్యంలో నిలిచింది. స్నాచ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన భారత లిఫ్టర్.. పసిడికి గట్టిపోటీనిచ్చింది. అనంతరం కీలకమైన జెర్క్ అండ్ స్నాచ్ విభాగంలో ఆమె 103 కిలోలు లిఫ్ట్ చేసింది. ప్రత్యర్థి ఒనొమె కూడా 105 కిలోలు ఎత్తడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇక రెండోసారి జ్ఞానేశ్వరి 107 కిలోలు ఎత్తింది. చివరి అటెంప్ట్‌లో ఇద్దరూ 111 కిలోలతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. మొత్తంగా 199 కిలోల బరువులు ఎత్తిన జ్ఞానేశ్వరి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల 65 కిలోల విభాగంలో ముత్తుపాండి భారత్‌కు మరో రజత పతకాన్ని అందించాడు. స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో 126 కిలోలు ఎత్తడంలో విఫలమైన అతడు, రెండో ప్రయత్నంలో అదే బరువును విజయవంతంగా ఎత్తాడు. అనంతరం 129 కిలోల ప్రయత్నం విఫలం కావడంతో స్నాచ్‌లో 126 కిలోలతో సరిపెట్టుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలోనూ తొలి ప్రయత్నంలో 158 కిలోలు ఎత్తలేకపోయిన ముత్తుపాండి.. ఆ తర్వాత పుంజుకుని రెండో ప్రయత్నంలో 160 కిలోలు విజయవంతంగా ఎత్తాడు. దీంతో మొత్తం 286 కిలోల బరువును ఎత్తి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
పతకాలకు చేరువలో భారత బాక్సర్లు
యువ బాక్సర్లు కామన్వెల్త్ క్రీడల్లో చెలరేగుతున్నారు. అంకుశ్, సచిన్ సివాచ్ లు పతకాలకు చేరువయ్యారు. పురుషుల 80 కిలోల విభాగంలో అంకుశ్ క్వార్టర్ ఫైనల్ చేరగా.. 60 కిలోల ఇంగ్లండ్ బాక్సర్‌ను చిత్తు చేసిన సచిన్ సైతం క్వార్టర్స్ బెర్తు సాధించాడు. దాంతో, వీరిద్దరూ మరో బౌట్ గెలిస్తే కనీసం కాంస్యం పతకం ఖాయం కానుంది. సోమవారం జరిగిన 16వ రౌండ్ ఇంగ్లండ్ బాక్సర్ విలియం హెవిట్‌ను సచిన్ చిత్తు చేశాడు. ఇక 80 కిలోల విభాగంలో అంకుశ్ ఆరంభం నుంచి జలాన్ జాన్(అంటిగ్వా)పై పంచ్‌ల వర్షం కురిపించాడు. దాంతో, భారత బాక్సర్ 5-0తో గెలుపొందాడు. ఏకపక్ష పోరులో సూపర్ విక్టరీ కొట్టిన ఈ పొడగరి బాక్సర్ అలవోకగా క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.
లాంగ్‌జంప్ ఫైనల్‌కు శ్రీశంకరన్, లోకేశ్
అథ్లెటిక్స్, లాంగ్‌జంప్ ఫైనల్లోకి శ్రీశంకరన్, లోకేశ్ సత్యనాథన్ ప్రవేశించారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో మురళీ శ్రీశంకర్ తొలి ప్రయత్నంలోనే 8.01మీ. జంప్ చేసి అర్హత మార్క్‌ను చేరుకున్నాడు. 27ఏళ్ల శ్రీశంకరన్ బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన 2022 కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించాడు. ఇక సత్యనాథన్ 7.77మీ. జంప్ చేసి 7వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇక బహమాస్‌కు చెందిన స్వర్ణ పతక విజేత లాక్వాన్ నైర్న్ 8.08మీ. జంప్ చేసి ప్రథమస్థానంలో నిలువగా.. మురళీ శ్రీశంకర్ 8.01మీ.తో రెండోస్థానంలో నిలిచాడు.
నిరాశపర్చిన గురిందెర్విర్ సింగ్
100మీ. పరుగులో పతకంపై ఆశలు రేపిన గురిందెర్విర్ సింగ్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో నిరాశపరిచాడు. సోమవారం జరిగిన పురుషుల 100 మీ. పరుగులో ఆరంభంలో దూకుడు కనబరిచినా చివరకు 10.39 సెకన్లలో పరుగు పూర్తి చేసి 28వ స్థానంలో నిలిచాడు. దాంతో, భారత చిరుతగా పేరొందిన అతడు సెమీఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యాడు. కామన్వెల్త్‌కు ముందు 10.10 సెకన్లతో రికార్డు సృష్టించిన గురిందెర్విర్.. 73 మంది పోటీపడిన 100మీ. పరుగులో సెమీఫైనల్‌కు చేరాలంటే 10.24 సెకన్లు పూర్తి చేయాలి. కానీ, గురిందెర్విర్ మాత్రం 10.39 సెకన్లు తీసుకున్నాడు.








కామెంట్‌లు (0)