ప్రజాశక్తి-విజయనగరం కోట: భారత స్వాతంత్ర్య పోరాటంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ, ఎందరికో ఆదర్శమూర్తిగా నిలిచిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని డాక్టర్ డి.వి.జి. శంకర్రావు కొనియాడారు. ఆదివారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా మహాకవి గురజాడ అప్పారావు స్వగృహంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి, శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గురజాడ విగ్రహానికి డాక్టర్ డి.వి.జి. శంకర్రావు, గురజాడ వారసులు గురుప్రసాద్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ డి.వి.జి. శంకర్రావు మాట్లాడుతూ, “దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా” అని మహాకవి గురజాడ వెంకట అప్పారావు చెప్పిన స్ఫూర్తితో మన చరిత్రను గుర్తించుకుని, పదిలపరచుకోవాలని అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య పోరాటంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి, తన రొమ్ము చూపిస్తూ “దమ్ముంటే కాల్చండి” అంటూ నిర్భయంగా నిలిచిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని పేర్కొన్నారు. ఆయన చూపిన అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా ‘ఆంధ్ర కేసరి’ బిరుదు లభించిందన్నారు. విలువలతో కూడిన ప్రజాజీవనాన్ని నిర్మించుకోవాలంటే మహనీయుల చరిత్రను తెలుసుకోవాలని, వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలని శంకర్రావు పిలుపునిచ్చారు. మన చరిత్రను పదిలపరచి రేపటి తరానికి అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ వారసులు గురజాడ వెంకట ప్రసాద్, గురజాడ ఇందిరా, తెలుగు భాషా పరిరక్షణ సమితి, శ్రీశ్రీ కళావేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)