ప్రజాశక్తి-విశాఖ కలెక్టర్ : విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్టీల్ కార్మికులకు న్యాయంగా చెల్లించాల్సిన వేతనాలలో కోతలు విధిస్తూ, హెచ్ఆర్ఎ ఇవ్వకుండా, కరెంటు చార్జీలు పెంచి, విఆర్ఎస్ కార్మికులకు బకాయిలు చెల్లించకుండా ఈ విధంగా రూ.900 కోట్లను యాజమాన్యం కార్మికులకు నిలుపుదల చేసిందని, వీటిని తక్షణమే చెల్లించాలని విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పోరాట కమిటీ ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ లు సిహెచ్ నర్సింగరావు (సిఐటియు), డి.ఆదినారాయణ (ఎఐటియుసి), మంత్రి రాజశేఖర్ (ఐఎన్ టియుసి) పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ .... ఆర్థిక అంశాలతోపాటు ప్రభుత్వం విశాఖ స్టీల్ లో మరమ్మతులు చేయడం కోసం రూ.8 వేల కోట్లు అందిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఆ ప్రక్రియ నేటి వరకు కార్యరూపం దాల్చలేదన్నారు. ఈ పరిణామాలలో కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు పని ప్రదేశాలలో భద్రత కరువై వారి ప్రాణాలు పైనే భరోసా కోల్పోతున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ కు రక్షణగా ఉండే సిఐఎస్ఎఫ్ దళాలను ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గం అన్నారు. ఈ చర్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి అడుగు అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ సమస్యలపై మీడియాలో మాట్లాడుకూడదని, ప్లాంట్ లో జరుగుతున్న పరిణామాలను బయటకు తెలియజేయకుండా ఉండాలంటూ యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. రాజ్యాంగ హక్కును కాలరాచే విధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వివరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ పరిస్థితులను చక్కబెట్టడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.ఎం శ్రీనివాస్,ఆర్.కె.ఎస్.వి కుమార్, సిపిఎం మాజీ కార్పొరేటర్ డాక్టర్ బి. గంగారావు,ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె అచ్యుతరావు,ఐఎన్ టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవిల్లి నాగభూషణం, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)