సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయవాడ : నామినేషన్లు వేయకుండా దాడిచేసిన టిడిపి నాయకులను అరెస్టు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. యంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో 3వ రోజు కూడా సిపిఎం అభ్యర్థులు నామినేషన్ వేయకుండా కర్నూలు, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో స్థానిక టిడిపి నాయకులు నామినేషన్ పత్రాలను చించివేసి సిపిఎం నాయకులపై దౌర్జన్యం చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండించారు. పోలీసులు రక్షణ కల్పించి, నామినేషన్ల కార్యక్రమం సజావుగా జరిగేటట్లు చూడకుండా, జరుగుతున్న దాడులపై ప్రేక్షకపాత్ర పోషించడమేగాకుండా దాడులు చేసే వారికి సహకరించడం దుర్మార్గమన్నారు. రక్షణ కల్పించాలని కోరినా పోలీసుల నుండి స్పందన లేదని.. నామినేషన్లు తీసుకోవాల్సిన ఆర్.వో.లు కూడా అధికార పార్టీ నాయకుల నామినేషన్లు తీసుకుని ఉదయం 10 గంటలకు వచ్చిన సిపిఎం అభ్యర్థుల నామినేషన్లు తీసుకోకపోవడం చట్ట దిక్కరణ అని అన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండల ఆర్వో వి.కృష్ణయ్యపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా నాయకులపై దౌర్జన్యం చేసిన క్రోసూరు సిఐ రవిని, కులం పేరుతో దూషించిన టిడిపి నాయకులు రామకోటేశ్వరరావు, పాలడుగు కుమారిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేయాలన్నారు.
కర్నూలు జిల్లా కోసిగి 5వ,6వ యంపిటిసి స్థానాలకు నామినేషన్లు వేసేందుకు వెళ్ళిన సిపిఎం అభ్యర్థుల నామినేషన్ పత్రాలను టిడిపి నాయకులు దౌర్జన్యంగా గుంజుకొని చించివేశారన్నారు. స్థానిక సిఐని రక్షణ కల్పించాలని కోరినా స్పందన లేదని.. నామినేషన్ పత్రాలు చించిన టిడిపి నాయకులపైన, ప్రేక్షకపాత్రవహించిన పోలీసులపైన తగుచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో ఊటుకూరు, యర్రబాలెం, పెరికపాడు ఎంపిటిసి స్థానాలకు సిపిఎం అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఉదయం 10 గంటలకు యంపిడివో ఆఫీసుకు వెళ్ళి వేచి చూసినా ఆర్.వో. నామినేషన్ పత్రాలు తీసుకోలేదన్నారు. సాయంత్రం 3 గంటల వరకు తీసుకోకుండా నామినేషన్ వేయనివ్వలేదన్నారు. తెలుగుదేశం నాయకులు సిపిఎం అభ్యర్థులపై దాడిచేసి ఆర్డివో ఆఫీసు నుండి తరిమివేశారని... పైగా అడ్డుకున్న సిపిఎం నాయకులు లక్ష్మీశ్వరరెడ్డి, నాయక్లపై పోలీసులు దాడి చేశారన్నారు. తరువాత వచ్చిన టిడిపి నాయకుల నామినేషన్ పత్రాలు తీసుకోవడం గమనార్హమన్నారు. నామినేషన్ పత్రాలు తీసుకోకుండా అడ్డుకున్న ఆర్.వో.పై చర్యలు తీసుకోవాలన్నారు. దాడిచేసి, తరిమివేసిన టిడిపి నాయకులపై, సిపిఎం నాయకులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, ముప్పాళ్ళ, క్రోసూరు జెడ్పిటిసి సిపిఐ(యం) అభ్యర్థులు నిన్న నామినేషన్ వేయకుండా తెలుగుదేశం నాయకులు అడ్డుకుని నామినేషన్ ఫారాలు చించివేశారు. క్రోసూరు అభ్యర్థి గంజిమాల రవిబాబును కులం పేరుతో దూషించి మరీ దాడిచేసి నామినేషన్ పత్రాలు చించివేశారు. కులంపేరుతో దూషించినవారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి
మార్కాపురం జిల్లా పామరులో సిపిఎం యంపిటిసి అభ్యర్థుల నామినేషన్ను టిడిపి నాయకులు అడ్డుకొని నామినేషన్ పత్రాలను చించి, మహిళలను గాయపర్చి అసభ్యంగా మాట్లాడుతూ దాడికి పూనుకోవడం జరిగింది.
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో దాడుల గురించి సుప్రీం కోర్టు హెచ్చరించినప్పటికీ యంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల నామినేషన్ల పర్వంలో 13 జిల్లాల్లో దాడులు, దౌర్జన్యాలు జరిగినట్లు స్వయంగా డిజిపి ప్రకటించడం దిగజారిపోతున్న శాంతిభద్రతల పరిస్థితిని వెల్లడిస్తున్నది. దీనికి అధికార పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇందులో రాష్ట్ర ఎన్నికల సంఘం వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు బాధ్యత వహించాలని కోరారు.








కామెంట్లు (0)