హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ రైలు హబ్ భూ సేకరణ ఉద్రిక్తతలకు దారితీసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ .... రైతులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో, పోలీసులపై దాడికి పాల్పడిన పలువురు రైతులపై శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. విధుల్లో ఉన్న అధికారులపై దాడి జరిగిందంటూ ... శంషాబాద్ రూరల్ ఎస్‌ఐ వనజ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిదిమంది రైతులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, దాడికి పాల్పడటం వంటి పలు సెక్షన్ల కింద ఈ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విమానాశ్రయానికి, ఓఆర్‌ఆర్‌కు మధ్య బహదూర్‌గూడలో సర్వే నంబర్ 62లో 500 ఎకరాలు, సర్వే నం.28లో 150 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఏళ్లుగా స్థానికులు వాటిని సాగు చేసుకుంటున్నారు. బుల్లెట్ రైలు, ఆర్టీసీ బస్సు ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైందనే సమాచారంతో కొన్నిరోజులుగా రైతులు గ్రామం వద్ద దీక్ష చేపట్టారు. కంచె నిర్మాణాన్ని వారు అడ్డుకుంటారనే ఉద్దేశంతో హైడ్రా.. పోలీసు బందోబస్తుతో శనివారం వేకువజామున రంగప్రవేశం చేసింది. దీక్షా శిబిరాన్ని తొలగించి ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ వేసింది. తమకు న్యాయం చేయాలని 8 రోజులుగా భూముల వద్ద దీక్ష చేస్తున్న రైతులు.. అక్కడికి వచ్చి హైడ్రాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. మరోవైపు 650 ఎకరాల ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోంది.
బహదూర్‌గూడ వివాదం ఉద్రిక్తత - రైతులపై కేసులు
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 19, 2026, 04:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)