సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‘కొల్లేరు’ మళ్లీ మొదటికి..

21 గంటల క్రితం

kolleru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 02:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- కేంద్ర సాధికారిక కమిటీ ఆదేశాలతో ప్రజల్లో ఆందోళన

- అమలుకాని
ప్రధాని నరేంద్ర మోడీ హామీ

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : కొల్లేరు సమస్య మళ్లీ మొదటికొచ్చింది. కేంద్ర సాధికారిక కమిటీ ఆదేశాలతో ఈ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ హామీ అమలుకు నోచుకోలేదు. సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన టిడిపి కూటమి ప్రభుత్వం కొల్లేరు ప్రజలతో ఆటలాడుతోంది. కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామని, కొల్లేరు ఆపరేషన్‌‌తో ధ్వంసమైన జిరాయితీ, సొసైటీ భూములను తిరిగి ఇప్పిస్తామని, త్వరలోనే తీపి కబురు వింటారని ప్రభుత్వం గత కొంతకాలంగా కొల్లేరు ప్రజలను నమ్మిస్తూ వచ్చింది. టిడిపి కూటమి ఎంపీ, ఎంఎల్‌ఎలు సమావేశాలు పెట్టి కొల్లేరు ప్రజల్లో ఆశలు నింపారు. తాజాగా కేంద్ర సాధికారిక కమిటీ ఇచ్చిన ఆదేశాలతో కొల్లేరు ప్రజల్లో తీవ్ర కలవరం నెలకొంది. అక్రమ చేపల చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు పూర్తి సహకారం అందించాలని కేంద్ర సాధికారిక కమిటీ (సిఇసి) జిల్లా కలెక్టర్‌‌ను ఆదేశించడంతో కొల్లేరు ప్రజల్లో తీవ్ర నిర్వేదం అలుముకుంది.

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని తొమ్మిది మండలాల్లో 77,138 ఎకరాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. 120 వరకూ బెడ్‌, బెల్ట్ గ్రామాలు ఉండగా, దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారిలో అత్యధికులు ఎస్‌‌సి, బిసి సామాజిక తరగతికి చెందిన నిరుపేదలే. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా కొల్లేరును ముంపు ప్రాంతంగా గుర్తించి వరి సాగుకు అనుకూలం కాదని, చేపల సాగుకు అనుకూలంగా ఉంటుందని అక్కడి ప్రజలతో బలవంతంగా చెరువులు తవ్వించారు. అక్కడి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న తరుణంలో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఆపరేషన్‌ ‌కొల్లేరు’ పేరుతో కొల్లేరులోని చేపల చెరువుల న్నింటినీ బాంబులు పెట్టి మరీ ధ్వంసం చేసింది. జిరాయితీ, ప్రభుత్వం పంపిణీ చేసిన సొసైటీ భూముల్లోని చేపల చెరువులను సైతం అధికారులు ధ్వంసం చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. కొల్లేరు ప్రజలు రోడ్డున పడ్డారు. ఉపాధి పోవడంతో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వలస వెళ్లి బతుకీడుస్తున్నారు. 2014 ఎన్నికల సందర్భంగా భీమవరం వచ్చిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ తాము అధికారంలోకి వస్తే కొల్లేరును మూడో కాంటూరుకు కుదించి ప్రజలకు న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. కొల్లేరును మూడో కాంటూరుకు కుదించాలంటూ అప్పట్లో టిడిపి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా అతీగతీ లేకుండాపోయింది.

22 వేల ఎకరాలు ఇస్తామని హడావుడి

టిడిపి కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో, కొల్లేరును ఆనుకుని ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి కూటమి అభ్యర్థులను అక్కడి ప్రజలు ఎంఎల్‌ఎలుగా గెలిపించారు. కొల్లేరును మూడో కాంటూరుకు కుదించాలంటూ అక్కడి ప్రజలు కోరగా, ధ్వంసం చేసిన జిరాయితీ భూములు 15 వేల ఎకరాలు, సొసైటీ భూములు ఏడు వేల ఎకరాలు మొత్తం 22 వేల ఎకరాల భూములు వెనక్కిస్తామంటూ గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ గత ఏడాది జూన్‌‌ 17, 18 తేదీల్లో కొల్లేరు ప్రాంతంలో పర్యటించింది. కొల్లేరు ప్రజల సమస్యలపై అక్కడి ప్రజలతోపాటు సిపిఎం, ఇతర రాజకీయ పార్టీలు ఈ కమిటీకి వినతులు అందించాయి. అక్కడి ప్రజలతో కమిటీ నేరుగా మాట్లాడింది. దీంతో, కేంద్రసాధికారిక కమిటీ సానుకూలంగా స్పందించిందని, త్వరలోనే తీపి కబురు వింటారని టిడిపి కూటమి నేతలు కొద్దిరోజులుగా తెగ హడావుడి చేస్తూ వచ్చారు. గత జూన్‌‌లో జిల్లా కలెక్టర్‌ అధికారులతో సమావేశం నిర్వహించి కొల్లేరు ఐదో కాంటూరు పరిధిలోని జిరాయితీ, డి-ఫారం భూములు దాదాపు 22 వేల ఎకరాలు ఉంటాయని, ఈ భూముల సమస్యల పరిష్కారానికి అక్కడి వారికి కల్పించాల్సిన పునరావాస కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సైతం చెప్పారు. అందుకు విరుద్ధంగా కేంద్ర సాధికారిక కమిటీ అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేయాలంటూ శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ‌కు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ విధంగా జనాలను మభ్యపెడుతూ వచ్చిందన్న, న్యాయం చేయడంలో సరైన చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం కొల్లేరు వాసుల్లో నెలకొంది.

కొల్లేరు ప్రజలకు న్యాయం చేయాలి

కొల్లేరులో పర్యావరణ నాశనం అనేది అక్కడి ప్రజల కారణంగా జరగడం లేదు. విజయవాడతోపాటు ఇతర ప్రాంతాలనుంచి వస్తున్న ఫ్యాక్టరీల వ్యర్థాలతో జరుగుతోంది. కొల్లేరు ప్రజలకు తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు సైతం లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం మంచి న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలి. అప్పుడే కొల్లేరు ప్రజలకు న్యాయం జరుగుతుంది.

-ఘంటసాల వెంకటలక్ష్మి, కొల్లేరు నాయకురాలు



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్