-ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, శ్రామిక మహిళా రాష్ట్ర సమన్వయ కమిటీ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆదోని మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న నరసమ్మపై దాడి చేసి పెట్రోల్ తో తగులబెట్టిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, శ్రామిక మహిళా రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్ కె ధనలక్ష్మి డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయపడిన నరసమ్మకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్, సిడిఎంఎ పి సంపత్ కుమార్‌లకు సోమవారం మెయిల్ ద్వారా వినతిపత్రాలు పంపినట్లు కె ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదోని పట్టణంలో గత అనేక సంవత్సరాలుగా నరసమ్మ పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తూ తన ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నారని తెలిపారు. ఆమె భర్త గతంలోనే మృతి చెందారని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం విధులు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమెపై దాడి చేసి గాయపర్చడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు రక్షణ లేకుండా పోతోందని యూనియన్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా కార్మికులపై లైంగిక వేధింపులు, దౌర్జన్యాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు ఏర్పాటు చేయాల్సిన ఫిర్యాదుల కమిటీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు.రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో మహిళా కార్మికుల రక్షణకు లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. స్త్రీ, పురుషులు కలిసి పనిచేసే అన్ని ప్రభుత్వ, మున్సిపల్ కార్యాలయాలు, విభాగాల్లో ఫిర్యాదుల కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఇకనైనా కమిటీలను ఏర్పాటు చేసి, వాటిలో మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో పాటు పారిశుధ్య, ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేసింది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసమ్మకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆమె ముగ్గురు పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.








కామెంట్‌లు (0)