--ఎపి రైతు సంఘం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోని మూడు ప్రభుత్వ షుగర్ ఫ్యాక్టరీలను లిక్విడేషన్ చేసి వాటి భూములను ఎపిఐఐసికి బదిలీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. ఇది చట్టవిరుద్ధరైతంమైన, అప్రజాస్వామిక చర్యని, నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య కె ప్రభాకరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలోని తాండవ, ఏటి కొప్పాక షుగర్ ఫ్యాక్టరీలు, విజయనగరం జిల్లాలోని భీమసింగి ఫ్యాక్టరీలను లిక్విడేషన్ చేసినట్లుగా గురువారం ప్రకటించిందని తెలిపారు. సహకార చక్కెర పరిశ్రమలను వేలాది మంది రైతులు తమ సొంత పెట్టుబడులు పెట్టి, షేర్లు కొని, తమ శ్రమను జోడించి నిర్మించుకున్న సంస్థలని తెలిపారు. అలాంటి సంస్థలను ప్రభుత్వం తన ఇష్టానుసారంగా రైతుల జనరల్ బాడీ ఆమోదం లేకుండా లిక్విడేట్ చేయడం అన్యాయం, చట్ట విరుద్ధమని తెలిపారు. కోపరేటివ్ చట్టం ప్రకారం షుగర్ ఫ్యాక్టరీకి షేర్ హోల్డర్లైన రైతులే యాజమానులని, ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్, సహాయక పాత్ర మాత్రమేనని పేర్కొన్నారు. రైతుల సొమ్ముతో కట్టిన ఫ్యాక్టరీని వారిని సంప్రదించకుండా, ఆమోదం లేకుండా మూసివేయడం అప్రజాస్వామికం, చట్ట విరుద్ధమని తెలిపారు. ఫ్యాక్టరీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా జనరల్ బాడీనే సర్వోన్నత అధికారం, ఆ అధికారాన్ని కాలరాసి, ప్రభుత్వం ఏకపక్షంగా లిక్విడేషన్ చేయడం సహకార వ్యవస్థ మూల సూత్రాలకే విరుద్ధమని తెలిపారు.ఫ్యాక్టరీలకు నష్టాలు వచ్చాయంటే దానికి కారణాలు ప్రభుత్వ విధానాలేనని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 29 చక్కెర ఫ్యాక్టరీల్లో 26 మూతపడ్డాయని తెలిపారు.కూటమి ప్రభుత్వం తన విధానాల్లో లోపాలను సరి చేసుకొని, చక్కెర పరిశ్రమను పునరుద్ధరించడానికి బదులుగా ఉన్న ఫ్యాక్టరీలను సంపూర్ణంగా మూతవేయాలనుకోవడం రాష్ట్ర రైతాంగం క్షమించరని పేర్కొన్నారు.వేలాది మంది కార్మికుల, లక్షలాది రైతాంగానికి ఉపాధి వనరైన చక్కెర పరిశ్రమకు దెబ్బతీసే విధానాలను మానుకోవాలని హితవు పలికారు.








కామెంట్‌లు (0)