మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించాలి

08 ఆగస్టు, 2026

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 08:38 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందుతున్న ఫలాలను విస్తృతంగా వివరించాలని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి శనివారం విచ్చేసిన ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ భావజాలాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోవాలని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. చేసిన పనులను ప్రజలకు చెప్పుకోకపోతే.. ప్రత్యర్థులు చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు సమర్థంగా వివరించగలిగితే.. ప్రత్యర్థుల కుట్రలను ప్రజలే తిప్పికొడతారని పేర్కొన్నారు. మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి భాగస్వాములు అవుతారనడానికి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవమే నిదర్శనమని చెప్పారు. పారదర్శకంగా వ్యవహరించి వాస్తవాలను ప్రజలకు చెబితే.. ప్రజలే కుట్రలను ఛేదిస్తారనడానికి కర్నూలులో ఉపాధ్యాయుల ఆందోళన ఉదాహరణగా నిలిచిందన్నారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణపై ప్రత్యర్థి పార్టీ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని స్పష్టంగా వివరించగలిగామని చెప్పారు. డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులే ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీ తీరును తప్పుపడుతూ ఆందోళన చేపట్టారని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే ప్రగతి నివేదిక విడుదల చేశామన్నారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యవస్థలను గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. సాధారణ కార్యకర్త నుంచి పార్టీ అగ్రనేత వరకు అందరికీ పార్టీనే సుప్రీం అని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానన్నారు.

వినతుల స్వీకరణ

మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు నాయుడు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రతి వినతిపత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ముఖ్యమంత్రి.. సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్