భేటీలో చంద్రబాబు, విజయ్
చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సిఎం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నదుల అనుసంధానంతోనే భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. విజయవాడ ఉత్సవ్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అమరావతిలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చిన విజయ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో నదుల అనుసంధానంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని, అనుసంధానంతోనే భవిష్యత్తు ఉంటుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారని ఆంధ్రప్రదేశ్ సిఎం కార్యాలయం తెలిపింది. గోదావరి - కావేరి నదుల అనుసంధానం ఆవశ్యకతను చంద్రబాబు ఈ సమావేశంలో వివరించారు. నదుల అనుసంధానం కరువుకు శాశ్వత పరిష్కారమని ఆయన చెప్పారు. నీరు రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం కాకుండా, పరస్పర సహకారానికి వేదిక కావాలని అన్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయం, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలిగితే నీటి కొరతకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని బాబు చెప్పారు. తెలుగు గంగ ద్వారా చెన్నైకు మరింతగా తాగునీరు విడుదల చేయాలని ఈ సందర్భంగా తమిళనాడు సిఎం విజయ్ కోరారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో కృష్ణా జలాలు తగ్గడం, తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొన్నప్పటికీ చెన్నై దాహార్తి తీర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ చంద్రబాబు ఈ సందర్భంగా స్పందించారు. ఇప్పటికే 4.08 టిఎంసిల నీటిని చెన్నై నగరానికి విడుదల చేసినట్టు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోనూ నీటి కొరత ఉన్నప్పటికీ, పొరుగు రాష్ట్రానికి సహకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.








కామెంట్లు (0)