మేయర్ అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు
ప్రజాశక్తి – విజయవాడ : నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రథమ ప్రాధాన్యమని మేయర్ అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన కండ్రిక, పరిసర డివిజన్లలో విస్తృతంగా పర్యటించి స్థానిక ప్రజలను నేరుగా కలుసుకున్నారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తాగునీటి ఎద్దడి, డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు, అంతర్గత రహదారుల మరమ్మతులు, వీధిదీపాల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యతా క్రమంలో చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గత పాలకులు వార్డుల సమగ్ర అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ప్రజలు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని అన్నారు. ప్రజా క్షేత్రంలో నిలబడి, ప్రతి సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాడతామని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
తమను గెలిపిస్తే రాబోయే మూడేళ్లపాటు ఇంటి పన్నులు పెంచబోమని స్పష్టమైన హామీ ఇచ్చారు. వీధి వ్యాపారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, అధికారుల వేధింపుల నుంచి వారిని రక్షించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
ఈ పర్యటనలో సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్ బాబూరావు, భాస్కరరావు, భూపతి రమణ, కాంగ్రెస్ నాయకులు నరహరశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ, సీపీఐ నాయకురాలు అక్కినేని వనజతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)