- ఎఐఐఇఎ పూర్వ ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్
- 1996 నోటిఫికేషన్‌లో నియమితులైన వారికి ఒపిఎస్ అమలుకు డిమాండ్
విజయవాడ: ప్రభుత్వ రంగంలోని జీవిత భీమా సంస్థ (ఎల్‌ఐసి)ని ప్రభుత్వమే బలహీన పరుస్తుందని అల్ ఇండియా ఇన్స్యూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐఐఇఎ) పూర్వ ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్ పేర్కొన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆమెరికా ఒత్తిడికి తలొగ్గి జీవిత బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఎల్‌ఐసి వాటాల విక్రయంతో డబ్బులు ప్రభుత్వం తీసుకుంటుందని, పాలసీదారులతో పాటు వాటాదారుల ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు రకాలుగా నిరసనలు తెలియజేశామన్నారు. సంస్థల్లో ఉద్యోగ విరమణల కారణంగా ఖాళీల సంఖ్య భారీగా పెరిగిందని, గత డిసెంబరులో 6 వేల మందిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని యాజమాన్యం తెలిపిందని, ప్రభుత్వం నుంచి ఇప్పటికీ అనుమతులు రాలేదన్నారు. ఖాతాదారుల సేవలను దృష్టిలో ఉంచుకుని నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎల్‌ఐసి తనంతట తాను పని చేసుకునే సంస్థ అని, డబ్బులు తాను సమకూర్చుకునే సంస్థ అని, దీని ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అయినప్పటికీ ఎల్‌ఐసి పని విధానంలో ప్రతిసారీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, ఇది సరైంది కాదన్నారు. అనేక రాష్ట్రల్లో ప్రస్తుతం కొత్త పెన్షన్ పథకం స్థానంలో పాత పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 1996లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో పాత పెన్షన్ ఇస్తామని పేర్కొని, అభ్యర్ధులకు ప్రమేయం లేని కోర్టు కేసుల వల్ల నియామకాలు 2012లో జరిగితే వారికి పాత పెన్షన్ ఇవ్వకపోవడం సరైంది కాదన్నారు. ఈ అంశాలపై ఇప్పటికే సమ్మె నిర్వహించామని, అవసరమైన భవిష్యత్తులోను సమ్మెకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎఐఐఇయు జోనల్ అధ్యక్షులు పి.సతీష్ మాట్లాడుతూ.. 1996 నోటిఫికేషన్‌లో ఎంపికైన అభ్యర్దులు, వారి ప్రమేయం లేని కోర్టు కేసుల కారణంగా 2012లో 300 మంది ఉద్యోగాల్లో చేరారని, వీరందరికీ పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకపోవడంతో దశాబ్ధాలు పని చేసిన పెన్షన్ వచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం 300 మందిని నిబంధనలు అనుకూలంగా ఉన్నా పాత పెన్షన్ పథకంలోకి మార్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. సంస్థలో ఖాళీ అయిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ నిలిపివేయాలన్నారు. జోనల్ సంయుక్త కార్యదర్శులు జి.తిరుపతయ్య, జి.కిషోర్ కుమార్‌లు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. 1996 నోటిఫికేషన్ ద్వారా 2012లో నియమకాలు పొందిన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలన్నారు లేనిపక్షంలో సమ్మెకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎల్‌ఐసి మచిలిపట్నం డివిజన్ అధ్యక్షులు డి.వాసు, యూనియన్ నాయకులు సుధాకర్ తదితరలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)