- ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు
- ఆదాయమంతా ఉద్యోగులకే అనే ధోరణి మానాలి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన మానుకోవాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఎంతో బయట పెట్టమని ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధం అవుతుంటే, రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగులకే చెల్లిస్తున్నామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి ఎవరికి ఎంత రావాలి, ఎప్పుడు చెల్లిస్తారు? బకాయిలు అన్ని పే స్లిప్ లో చూపాలని రెండేళ్లుగా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని తెలిపారు. ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఉద్యోగులు ప్రజల్లో, ప్రభుత్వంలో భాగం కాదా అని ప్రశ్నించారు. ఉద్యోగులపై పెడుతున్న ఖర్చును మొత్తం ఖర్చులో ఎంత శాతమో చెప్పకుండా, ఆదాయమంతా ఉద్యోగులకే అని చెప్పడం బాధాకరమని వివరించారు. ప్రభుత్వం చేసిన మొత్తం రెవెన్యూ ఖర్చులో ఉద్యోగులకు/ పెన్షనర్స్ కు చెల్లిస్తున్న ఖర్చు మొత్తం కేవలం 37.41 శాతమేనని వివరించారు. అధికారిక గణాంకాల ప్రకారం టాక్స్ రెవెన్యూ ఆదాయంలో ఉద్యోగులకు అయ్యే ఖర్చు కేవలం 59.36 శాతమేనని పేర్కొన్నారు.
అధికారిక గణాంకాల ప్రకారము మొత్తం రెవెన్యూ ఆదాయంలో ఉద్యోగులకు అయ్యే ఖర్చు 47.64 శాతమేనని తెలిపారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా రిటైర్ అయినా చెల్లించడం లేదని, ఒకసారి జీతంతో పాటు చెల్లించినట్లు చూపిన మొత్తాలే ఇప్పుడు చెల్లించారని వివరించారు. శ్వేత పత్రంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన 5 డి ఏ ల సంగతి, మధ్యంతర భృతి, పి.ఆర్సి కమిషనర్ నియామకం, అదనపు పింఛను పునరుద్ధరణ, ఎంప్లాయిస్ హెల్త్ కార్డు తదితర అంశాల గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. జూలై 22న మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపినా ఇప్పటి వరకు ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదన, అసంతృప్తికి కారణమైందని అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వాన్ని కొత్త డిమాండ్లు అడగడం లేదని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యాని ఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నారే తప్ప ఉద్యోగులవి గొంతమ్మకోర్కేలు కావని స్పష్టం చేశారు. ఈనెల ఆగస్టు 4వ తేదీన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉండటం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం శ్వేతపత్రంలో, ఉద్యోగులపై పెడుతున్న ఖర్చును రాష్ట్రం మొత్తం ఖర్చులో ఎంత శాతమో చెప్పకుండా, ఆదాయమంతా ఉద్యోగులకే అని చెప్పడం బాధాకరమని, కాగ్ నివేదికల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్చరానికి సంబంధించి ప్రభుత్వం చేసిన మొత్తం రెవెన్యూ ఖర్చులో ఉద్యోగులకు/ పెన్షనర్స్ కు చెల్లిస్తున్నఖర్చు మొత్తం కేవలం 37.41 శాతమేనని తెలిపారు. ఎపీ జేఏసీ అమరావతి ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేసిన 29 అంశాలలలో ప్రధానమైన డిమాండ్ లను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలను వెల్లడించాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఎపిజెఎసి సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ రావు, టీవీ ఫణి పేర్రాజు, తిమ్మసర్తి నాగేశ్వరరావు, లక్షీ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)