- 84.91 శాతం పెండింగ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) లో భాగంగా జారీ చేసిన నోటీసులపై విచారణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు జారీ చేసిన నోటీసుల్లో 84.91 శాతం విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈనెల 21 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 38,14,602 నోటీసులు పంపిణీ చేయగా, వాటిలో 5,75,699 పై విచారణ పూర్తయింది. ఇంకా 32,38,903 విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి మొత్తం నోటీసుల్లో 84.91 శాతంగా నమోదయ్యాయి. గడిచిన ఒక్కరోజులో 1,56,848 విచారణలు పూర్తయ్యాయి. పూర్తయిన విచారణల్లో 3,190 మందిని అనర్హులుగా గుర్తించారు. నోటీసుల విచారణలో మార్కాపురం జిల్లా అత్యధికంగా 98.37 శాతం పెండింగ్‌తో వెనుకబడి ఉంది. అక్కడ 1,64,519 విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి. పశ్చిమగోదావరిలో 97.83 శాతం, పార్వతీపురం మన్యంలో 96.61,ప్రకాశంలో 96.28 శ్రీ సత్యసాయి జిల్లాలో 94.09 విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి.పెండింగ్ విచారణల్లో కర్నూలు జిల్లా మెరుగైన ప్రగతిని సాధించింది. ఇక్కడ 56.77 శాతం విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి. ఏలూరులో 60.10 , అనంతపురంలో 69.36 అనకాపల్లిలో 74.01 శాతం పెండింగ్‌గా నమోదైంది. ఓటర్ల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ‘బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఒ’ సేవలో పెండింగ్ గణనీయంగా తగ్గింది.ఈనె 21 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,00,259 కాల్స్ రాగా, 97,022 కాల్స్‌కు బిఎల్‌ఒలు స్పందించినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. 2,706 మంది ఓటర్లు అందుబాటులో లేరు.ఈ జూన్ 15నుంచి జులై 24 వరకు బిఎల్‌ఒ లు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ జరిపారు. జులై 31న డ్రాప్ట్ రోల్ ప్రచురించారు. జులై 31నుంచి ఆగస్టు 30వరకు నోటీసులు విచారణ, సెప్టెంబర్ 28వరకు అబ్జెక్షన్ల పరిష్కారం, అక్టోబర్ 3న తుది ఓటర్ జాబితాను ప్రచురిస్తారు. ప్రభుత్వం తొలగించిన 44.89లక్షల మందిలో నిజమైన ఓటర్లు ఉంటే, ఆగస్టు 30లోగా ఫారమ్ 6 తో పాటు డిక్లరేషన్ సమర్పించి పేరు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. పంపిణీ చేసిన నోటీసుల విచారణలో వెనుకబడి ఉన్నామని సిఇఒ వివేక్ యాదవ్ తెలిపారు. విచారణ వేగవంతం చేయాలని ఆదేశించామన్నారు.








కామెంట్‌లు (0)