ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చింతా అప్పలనాయుడుకు చాసో కథా పురస్కారం

2 గంటల క్రితం

awadrs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 12:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- స్వర్ణ కిలారికి చాగంటి తులసి అనువాద పురస్కారం

- ఆగస్టు 2న విజయనగరంలో ప్రదానోత్సవం

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : చాసో స్ఫూర్తి ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి చాసో కథా పురస్కారాన్ని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన రచయిత చింతా అప్పలనాయుడు రచించిన ‘నకజనకరి... నాం... నాం...’ కథల సంపుటికి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందిన స్వర్ణ కిలారి అనువదించిన ‘లిప్తకాలపు స్వప్నం’ గ్రంథానికి చాగంటి తులసి అనువాద పురస్కారం ప్రకటించారు. ‘చాసో స్ఫూర్తి’ వ్యవస్థాపకులు, ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి విజయనగరంలోని తన నివాసంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పురస్కార వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1997 నుంచి చాసో జయంతిని పురస్కరించుకొని చాసో స్ఫూర్తి ఆధ్వర్యంలో ఏటా సాహిత్య సభలు, పురస్కార ప్రదానోత్సవాలు నిర్వహించామని తెలిపారు. దాదాపు పాతికేళ్లపాటు నిరాటంకంగా కొనసాగిన ఈ కార్యక్రమాలు వయోభారం కారణంగా నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జిల్లా శాఖ నిర్వహణ బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇకపై ప్రతి ఏటా ఉత్తమ కథా రచయితకు చాసో కథా పురస్కారం, అనువాద రంగంలో విశేష కృషి చేసిన రచయితకు చాగంటి తులసి అనువాద పురస్కారం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ రెండు పురస్కారాలకు నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం ప్రదానం చేస్తామని తెలిపారు. ఆగస్టు రెండో తేదీన విజయనగరంలో జరిగే కార్యక్రమంలో ఉదయం చాగంటి తులసి సాహితీ సమాలోచన, మధ్యాహ్నం పురస్కార ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో అరసం విజయనగరం జిల్లా అధ్యక్షుడు జిఎస్ చలం, ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్